తాడిచర్ల- 2 ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డికి మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి

తాడిచర్ల- 2 ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డికి మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
  • స్థానికులకే వెయ్యి ఉద్యోగాలు కల్పించాలి 
  • సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం 
  • రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని రిక్వెస్ట్​
  • తెలంగాణలో వరల్డ్ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయండి
  • రామగుండం 100 పడకల 
  • ఈఎస్ఐ హాస్పిటల్ హామీ నెరవేర్చండి
  • కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, మన్సుఖ్‌‌‌‌ మాండవీయకు వివేక్‌‌‌‌ విన్నపం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచర్ల–-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్రాన్ని మంత్రి వివేక్ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  కోరారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని రిక్వెస్ట్‌‌‌‌ చేశారు. సోమవారం పార్లమెంట్‌‌‌‌లోని చాంబర్‌‌‌‌‌‌‌‌లో  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని వివేక్‌‌‌‌, వంశీకృష్ణ కలిశారు. తాడిచర్ల –2 ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కనీసం వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. 

ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌‌‌‌మెంట్) ప్యాకేజీ కింద సమగ్ర పునరావాసం, పునరుద్ధరణ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  మణుగూరులో అదనపు బొగ్గు బ్లాక్‌‌‌‌ను  సింగరేణికి కేటాయించాలని కోరారు. అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల తలెత్తిన సమస్యలపై చర్చించారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ..  కొత్త మైనింగ్ హక్కులను ‘నామినేషన్ పద్ధతి’లో పొందేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు.

 దీంతోపాటు పెద్దపల్లి ప్రాంతంలో కొత్త పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు నేషనల్ మినరల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) భాగస్వామ్యానికి ఆమోదం కోరారు.  ఈ అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు.  పెద్దపల్లికి క్లస్టర్ మంజూరు చేసే విషయంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ  మంత్రి హెచ్‌‌‌‌డీ కుమారస్వామితో సమన్వయం చేసుకుంటానని హామీ ఇచ్చారని మంత్రి వివేక్ వెల్లడించారు.

పెన్షన్‌‌‌‌ పెంచండి

సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ రూ.10 వేలు అందేలా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డిని వివేక్‌‌‌‌, వంశీకృష్ణ కోరారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌‌‌‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, బొగ్గు గనుల విస్తరణ, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు వివేక్,  వంశీకృష్ణ మీడియాకు తెలిపారు. 

త్రి భాషా విధానం కింద ఇంటర్నేషనల్‌‌‌‌ లాంగ్వేజీ నేర్పించాలి

తెలంగాణలో వరల్డ్ స్కిల్ ల్యాబ్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర స్కిల్​ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ శాఖ మంత్రి జయంత్ చౌదరీని మంత్రి వివేక్ కోరారు. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం కేంద్ర మంత్రులు జయంత్ చౌదరీ, మన్సుఖ్‌‌‌‌ మాండవీయ,  కిషన్‌‌‌‌రెడ్డిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలిసి వివేక్‌‌‌‌ విడివిడిగా కలిశారు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా త్రి భాషా విధానం కింద అంతర్జాతీయ భాషను నేర్పించాలని జయంత్‌‌‌‌ చౌదరీని రిక్వెస్ట్‌‌‌‌ చేశారు. 

తద్వారా విదేశాల్లోనూ నిరుద్యోగ యువత ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించేందుకు దోహదపడుతుందని చెప్పారు.  ఈ సందర్బంగా రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఉద్యోగాల కల్పన, కార్మికుల సంక్షేమం, సింగరేణి సంస్థ బలోపేతంలాంటి అంశాలపై చర్చించారు. ‘పీఎం సేతు’  స్కీమ్‌‌‌‌ కింద మరిన్ని క్లస్టర్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని వివేక్‌‌‌‌ కోరారు.  తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి వివేక్ తెలిపారు. వరల్డ్ స్కిల్ ల్యాబ్‌‌‌‌కు కావాల్సిన స్థలాన్ని అప్పగిస్తే.. తెలంగాణలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

 అలాగే, ‘పీఎం సేతు’ కింద రాష్ట్రానికి మరిన్ని క్లస్టర్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఈ స్కీమ్‌‌‌‌ కింద దేశంలోనే మూడు క్లస్టర్లు పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉందని కేంద్ర మంత్రి అభినందించనట్టు చెప్పారు. తెలంగాణలో యువతకు నైపుణ్యాన్ని కల్పించే దిశలో  రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, కార్మిక శాఖ అనుసరిస్తోన్న విధానాలను ప్రశంసించారని తెలిపారు. జర్మన్, జపనీస్ భాషలతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ యువత పొందుతున్న ఉద్యోగాల విషయంలో కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేసినట్టు మంత్రి వెల్లడించారు.   

రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్‌‌‌‌కు జీవో ఇవ్వండి

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో మంత్రి గడ్డం వివేక్, ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో  రామగుండంలో మంజూరైన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి త్వరగా జీవో జారీ చేయాలని కోరారు. ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ అంశంపై హామీ ఇచ్చినట్టు కేంద్ర మంత్రికి  వివేక్ గుర్తు చేశారు. ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలోని కార్మిక వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. అయితే, ఈ హాస్పిటల్ ఏర్పాటుతోపాటు తెలంగాణ కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని వివేక్‌‌‌‌ వెల్లడించారు.