హైదరాబాద్, వెలుగు: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది.
మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ, పోస్టింగ్స్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా 174 జనరల్ సర్జరీ, 166 జనరల్ మెడిసిన్, 89 ఆర్థోపెడిక్స్, 71 రేడియాలజీకి సంబంధించిన మొత్తం 500 పోస్టులకు ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
