బస్‌‌ భవన్‌‌ ఎదుట రిటైర్డ్‌‌ ఆర్టీసీ కార్మికుల ధర్నా..పలువురి అరెస్ట్‌‌

బస్‌‌ భవన్‌‌ ఎదుట రిటైర్డ్‌‌ ఆర్టీసీ కార్మికుల ధర్నా..పలువురి అరెస్ట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌‌ చేస్తూ రిటైర్డ్‌‌ ఆర్టీసీ కార్మికులు మంగళవారం హైదరాబాద్‌‌లోని బస్‌‌ భవన్‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రిటైర్డ్‌‌ ఉద్యోగులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్‌‌ భవన్‌‌ ఎదుట బైఠాయించారు.

ఆర్టీసీలోని పలు యూనియన్ల నాయకులు ధర్నాకు సంఘీభావం తెలిపారు. రిటైర్డ్‌‌ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి వృద్ధాప్యంలో ఉన్న ఉద్యోగులను ఆదుకోవాలని వారు కోరారు. ధర్నా సందర్భంగా పోలీసులు, రిటైర్డ్‌‌ కార్మికుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని సమీప పీఎస్​కు తరలించారు. కొన్ని జిల్లాల్లో ముందస్తుగా పలువురు రిటైర్డ్‌‌ ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌‌ చేశారు.