ప్రతి పోలింగ్ బూత్ నుంచి.. జనాలను తీస్కురావాలె: రేవంత్ రెడ్డి

ప్రతి పోలింగ్ బూత్ నుంచి.. జనాలను తీస్కురావాలె: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను విజయభేరి సభకు తీసుకొచ్చి సక్సెస్ చేయాలని డీసీసీ ప్రెసిడెంట్లకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. 17న తుక్కుగూడలో నిర్వహించే సభకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులతో సభపై జూమ్​లో సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ పలు సూచనలు చేశారు. ‘‘సోమవారం నుంచి అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించండి. రాష్ట్రంలోని 35వేల పోలింగ్ బూత్​ల నుంచి ప్రజలను సభకు తరలించాలి. సోమవారం మేము పార్లమెంట్ అబ్జర్వర్లు, వైస్​ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహిస్తాం. 

వాళ్లు మంగళ, బుధ, గురువారాలు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సమీక్షలు చేస్తారు. డీసీసీ అధ్యక్షులు వాళ్లతో సమన్వయం చేసుకోవాలి”అని రేవంత్ అన్నారు. విజయభేరి సభలో సోనియా గాంధీ ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని వివరించారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకల్లా అన్ని నియోజకవర్గాలకు జాతీయ నాయకులు చేరుకుంటారన్నారు. వారితో కలిసి ఇంటింటికీ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన పోస్టర్లు అతికించాలని సూచించారు. తర్వాత ప్రెస్​మీట్ పెట్టి ఐదు గ్యారెంటీలను వివరించాలని రేవంత్ సూచించారు.

గ్రామ గ్రామాన చార్జ్​షీట్లు: ఠాక్రే

విజయభేరి సభను సక్సెస్ చేయాలని డీసీసీ చీఫ్​లకు మాణిక్ రావు ఠాక్రే సూచించారు. జనాల తరలింపుపై మండలాలవారీగా సమీక్షలు నిర్వహించాలన్నారు. ‘‘తిరగబడదాం.. తరిమికొడదాం..’’ అనే నినాదంతో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై గ్రామగ్రామాన చార్జ్​షీట్లను రిలీజ్ చేయాలని తెలిపారు. విజయభేరి సభకు జాతీయ స్థాయి నేతలు వస్తున్నారని, సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. విజయభేరి సభను సోనియా గాంధీకి పౌర సన్మానంలా చేయాలని మధుయాష్కీ అన్నారు. పార్టీ కోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం నిర్వహిస్తున్న సభలా చూడాలని సూచించారు.

ఐదేండ్లలో ఏం చేశారో చెప్పాలి

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రేవంత్ అన్నారు. కొడంగల్​ను అభివృద్ధి చేస్తామన్న బీఆర్ఎస్ నేతలు.. ఈ ఐదేండ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆదివారం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. 

కొడంగల్​ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న కేటీఆర్.. నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చిన్నచిన్న ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా చేసిన రాష్ట్ర సర్కారు.. కొడంగల్​ను మాత్రం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓట్లకోసం వచ్చే బీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.