- నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నం: సీఎం రేవంత్
- మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టినం
- క్యూర్, ప్యూర్, రేర్‌తో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
- 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ.. కేంద్రం సహకరించాలి
- గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం
- మూసీ పునరుజ్జీవం అద్భుతమైన ప్రాజెక్టు..పార్లమెంట్ కమిటీ కితాబు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించామని చెప్పారు. శనివారం సెక్రటేరియెట్‌లో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పెరుగుతున్న నగరీకరణ, ఆధునీకరణ వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణతోపాటు అండర్‌పాస్‌లు, రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లలాంటి మూడు విధానాల్లో రవాణా మార్గాలను సులభతరం చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు
మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడుతం..
తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న క్యూర్‌ను సర్వీస్ సెక్టార్‌గా, ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపు ఉన్న పెరి అర్బన్ రీజియన్ (ప్యూర్)ను మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌గా, రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ (రేర్)ను వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం అభివృద్ధి చేస్తామని వివరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆయన కమిటీకి అందజేశారు.కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపా డడానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు పార్లమెంట్కమిటీ ప్రశంస
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, కోర్ అర్బన్ రీజియన్‌లో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును నగర సంస్కృతికి అనుసంధానిస్తూ ఒక విప్లవాత్మకమైన అడుగుగా చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవనం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది. కాగా, మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు దేశంలోనే విప్లవాత్మకమైనదని కమిటీ సభ్యులు ప్రశంసించారు. హైదరాబాద్ జీవన స్థితిగతులను మెరుగుపరిచే దిశగా సీఎం తీసుకుంటున్న చర్యలను, ముఖ్యంగా మహిళాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు, సీఎస్ రామకృష్ణారావు, కేంద్ర-, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
