బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ : రేవంత్

 బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ : రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: ఎన్డీయే అంటే నేషన్ డివైడ్ అలయెన్స్ అని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని.. బ్రిటిషర్లు తెచ్చిన ‘విభజించు.. పాలించు’ విధానాన్ని ఆ పార్టీ అనుసరిస్తున్నదని ఆరోపించారు. మణిపూర్ లో కుకీలు, నాగాలు, మైతీల మధ్య బీజేపీ ప్రభుత్వం పంచాది పెట్టిందని మండిపడ్డారు. బుధవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో రేవంత్ తెలుగులో మాట్లాడారు. 

నేషన్ డివైడ్ అలయెన్స్

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణిపూర్ లో జరిగిన ఘటనలపై సభలో ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. కానీ ప్రధాని కనీసం సభకు కూడా రాలేదని.. ఆదివాసీలు, గిరిజనులపై ఆయనకు చులకన భావం ఉన్నదని విమర్శించారు. ‘‘తొమ్మిదేండ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలపై 140 కోట్ల మంది ప్రజల తరఫున ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పక్షాన అవిశ్వాసానికి నేను మద్దతు తెలుపుతున్నాను. ప్రజలకు ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం పోయింది. ఇప్పటికైనా మణిపూర్ ఘటనపై సభలో ప్రధాని మాట్లాడాలి” అని డిమాండ్ చేశారు. ‘‘మణిపూర్ మండిపోతుంటే, ఆడబిడ్డలు కాలిపోతుంటే, నెత్తురు ఏరులై పారుతుంటే హుటాహుటినా అక్కడి వెళ్లాల్సిన ప్రధాని, హోంమంత్రి కర్నాటకలో ఓట్ల వేట కోసం వెళ్లారు. ఆదివాసీల ప్రాణాల కన్నా ఎన్నికలు, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ నేతలు భావించారు. మణిపూర్ ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాముడిని, భజరంగ్ బలిని మత రాజకీయాలకు వాడుకోవాలనుకున్న బీజేపీ వైఖరిని కర్నాటక ప్రజలు తిరస్కరించారు. కర్నాటక ఇచ్చిన తీర్పు.. దేశానికి దిక్సూచి” అని అన్నారు.