ఇవాళ ఢిల్లీకి రేవంత్

ఇవాళ ఢిల్లీకి రేవంత్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీఆర్​ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశముందని తెలుస్తున్నది. రేవంత్​తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్​పర్సన్ సరిత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కోదాడకు చెందిన బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గురువారం వాళ్లు ఖర్గేతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా కాంగ్రెస్ లో చేరతారని చర్చ నడుస్తున్నది.

ఉత్తమ్​ను కలవనున్న వీరేశం

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో బుధవారం వేముల వీరేశం, శశిధర్ రెడ్డి సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటు వేముల వీరేశం చేరికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు బుధవారం సమావేశం కానున్నారు. వెంకట్​రెడ్డి నివాసంలో వాళ్లు లంచ్ మీటింగ్​లో పాల్గొననున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో వేముల వీరేశం, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరేశం చేరిక మీద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రేవంత్, ఠాక్రేతో తీగల భేటీ

బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​పర్సన్ అనితా రెడ్డితో కలిసి త్వరలోనే పార్టీలో చేరనున్నట్టు సమాచారం. మంగళవారం మాణిక్​రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్​రెడ్డి రంగారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. మళ్లీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబిత చేతిలోనే తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్​లో చేరి మంత్రి పదవిని చేపట్టారు. బీఆర్ఎస్​లో కృష్ణారెడ్డికి ప్రాధాన్యం తగ్గింది. ఇటు సిట్టింగ్​లకే బీఆర్ఎస్ సీట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

నువ్వు మంత్రివా.. బంట్రోతువా? జగదీశ్ రెడ్డిపై రేవంత్ ఫైర్

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్తున్నా.. సీఎండీ ప్రభాకర్ రావు మాత్రం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇస్తున్నామంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తన శాఖలో ఏం జరుగుతున్నదో జగదీశ్ రెడ్డికే తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. మంగళవారం సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘నువ్వు మంత్రివా.. ఆ శాఖలో బంట్రోతువా? ఉచిత విద్యుత్​పై అసలు ఎప్పుడైనా సమీక్ష చేశావా? ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఒకటో తేదీనే విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పడేవి. కానీ, బీఆర్ఎస్ పాలనలో 20వ తేదీ వచ్చినా జీతాలు రావట్లేదు. అంతటి పరిస్థితికి విద్యుత్ శాఖ దిగజారింది. అందుకు జగదీశ్ రెడ్డి సిగ్గుతో తలదించుకుని తన పదవికి రాజీనామా చేయాలి’’ అని జగదీశ్ రెడ్డిపై రేవంత్ మండిపడ్డారు. కాగా, పార్టీలో చేరిన వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంబాబు, మాజీ కౌన్సిలర్లు తదితరులున్నారు.