- ప్రమోషన్లు లేకుండానే బదిలీలు, పోస్టింగులు
- రెవెన్యూ శాఖలో గందరగోళం!
- క్యాడర్, సీనియార్టీ పట్టించుకోకుండానే కీలక పోస్టులు
- నేరుగా డీఆర్వో కుర్చీల్లో తహసీల్దార్లు
- డిప్యూటీ తహసీల్దార్లుగా సీనియర్ అసిస్టెంట్లు
- అన్నిచోట్లా జూనియర్, సీనియర్ పంచాయితీలు
- క్షేత్రస్థాయిలో స్తంభించిన పాలన.. ఇబ్బందుల్లో జనం
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో ఇటీవల జరిగిన బదిలీలు, పోస్టింగుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సీనియార్టీని తుంగలో తొక్కుతూ, క్యాడర్ నిబంధనలను బేఖాతరు చేస్తూ చేసిన బదిలీల వల్ల పాలనంతా గందరగోళంలో పడింది. సాధారణంగా కింది స్థాయి అధికారులకు ప్రమోషన్ ఇచ్చి, వారి జీతభత్యాలు పెంచి పైస్థాయి పోస్టుల్లో నియమించాలి. కానీ, ఇక్కడ కేడర్ మార్చకుండా, ప్రమోషన్ ఇవ్వకుండా కీలక పోస్టులను కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. తహసీల్దార్లను నేరుగా ఆర్డీవో, డీఆర్వో కుర్చీల్లో కూర్చోబెట్టడంతో అన్నిచోట్లా జూనియర్, సీనియర్ పంచాయితీలు మొదలయ్యాయి.
దాదాపు 180 మంది సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా డిప్యూటీ తహసీల్దార్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు. కోర్టు కేసులకు లోబడి పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన జరిగిన ఈ నియామకాల్లో అధికారులకు పాత క్యాడర్ (సీనియర్ అసిస్టెంట్) స్కేల్ వేతనమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉదాహరణకు భూసేకరణ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కోట్ల రూపాయల పరిహారాలు, భూ వివాదాలతో ముడిపడి ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్థానాల్లో రెగ్యులర్ ప్రమోషన్ల ద్వారా కాకుండా నేరుగా తహసీల్దార్లను కూర్చోబెట్టడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తహసీల్దార్ల నుంచి డైరెక్ట్ డీఆర్వోలుగా..
శాఖాపరమైన నియమాలను, క్యాడర్ నిబంధనలను దాటి చేపట్టిన పలు బదిలీలు, పోస్టింగులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. నిర్మల్ తహసీల్దార్ మోతీరామ్‌ను మంచిర్యాల డీఆర్వోగా, కరీంనగర్ తహసీల్దార్ బి రాజేశ్వరిని పెద్దపల్లి డీఆర్వోగా, పెద్దపల్లి తహసీల్దార్ కేవై ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్వోగా, వనపర్తి తహసీల్దార్ ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్వోగా బదిలీ చేశారు. అలాగే, ఖమ్మం తహసీల్దార్ వి.రవి కుమార్‌ను ములుగు డీఆర్వోగా, మేడ్చల్-మల్కాజ్‌గిరి తహసీల్దార్ జె. స్వామిని కరీంనగర్ డీఆర్వోగా, నాగర్‌కర్నూల్ తహసీల్దార్ ఎ. పాండును కామారెడ్డి డీఆర్వోగా, జనగామ తహసీల్దార్ సీహెచ్. శ్రీకాంత్‌ను మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ ఎల్ఏగా నియమించారు. డిప్యూటీ తహసీల్దార్ఎం. రమేశ్ కుమార్‌ను సీనియార్టీని పక్కనబెట్టి తహసీల్దార్ క్యాడర్ పోస్టులోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎ. లావణ్య అనే డిప్యూటీ తహసీల్దార్‌ను జిల్లా కలెక్టరేట్‌లోని అత్యంత కీలకమైన ఏఓ క్యాడర్ పోస్టుకు బదిలీ చేశారు. పి. వెంకటేశ్వర్లు అనే తహసీల్దార్‌ను ఎలాంటి ప్రమోషన్ లేకుండానే నేరుగా ఆర్డీఓ పోస్టుకు బదిలీ చేశారు. జి. అనూరాధ అనే తహసీల్దార్ ను జిల్లా స్థాయి పోస్ట్ అయిన డీఆర్వో క్యాడర్‌కు బదిలీ చేస్తూ ఇన్చార్జి
బాధ్యతలు కట్టబెట్టారు.
భూ సమస్యలు పక్కనబెట్టి..
ఒకవైపు రాష్ట్రంలో ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం కోసం లక్షలాది మంది పెట్టుకున్న దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. సరిహద్దు తగాదాలు, విస్తీర్ణంలో తేడాలు, నిషేధిత జాబితాలో చేర్చడం, సర్వే సమస్యలు, డిజిటల్ సంతకాల కోసం రైతులు, సామాన్య ప్రజలు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, ఆ పనిచేయకుండా తప్పుడు బదిలీలు, పోస్టింగ్‌లతో వివాదాల్లో చిక్కుకున్నారు. జూనియర్ల కింద సీనియర్లు పనిచేయాల్సి రావడం, అర్హత లేని వారికి కీలక పోస్టులు దక్కడంతో అన్నిచోట్లా సీనియర్, జూనియర్ పంచాయితీలు మొదలయ్యాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పాలన స్తంభించిపోయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
