కిషన్​రెడ్డికి రేవంత్ సవాల్​

కిషన్​రెడ్డికి రేవంత్ సవాల్​
  •    ఎఫ్​సీఐ తనిఖీల్లో కుంభకోణం బయటపడింది 
  •     ఏటా వేల కోట్ల దందా 
  •     మిల్లర్లతో టీఆర్​ఎస్ ముఖ్యనేతల కుమ్మక్కు


హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ధాన్యం విషయంలో సర్కార్​, రైస్​ మిల్లర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సవాల్​ విసిరారు. టీఆర్​ఎస్ సర్కార్​లోని కొందరు ముఖ్యనేతలు మిల్లర్లతో కుమ్మక్కై ఏటా వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారన్నారు. ఎఫ్​సీఐ తనిఖీల్లో ఈ విషయం బయటపడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసని, ఆయన కూడా మీడియా ముందు వెల్లడించారన్నారు. అందుకే ఈ విషయంపై దర్యాప్తు కోరుతున్నానన్నారు. గురువారం కిషన్​ రెడ్డికి రేవంత్​ బహిరంగ లేఖ రాశారు.

రేషన్ ​బియ్యం రిసైక్లింగ్

ఈ ఏడాది మార్చి 22, 24 తేదీల్లో ఎఫ్​సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసినపుడు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ఇచ్చిన ధాన్యంలో 4, 53, 896 బస్తాలు గోల్​మాల్ అయినట్లు గుర్తించారని రేవంత్​ లేఖలో పేర్కొన్నారు. 2020–21 యాసంగి, 2021–22 వానా కాలానికి సంబంధించిన ధాన్యం విషయంలో అధికారులు తనిఖీలు చేపట్టారని వివరించారు. దీన్నిబట్టి ప్రభుత్వం సీఎంఆర్ కింద కేటాయించిన వడ్లను మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి సరఫరా చేయకుండా, మార్కెట్​లో అధిక ధరకు అమ్ముకొంటున్నారని అర్థం మవుతోందన్నారు. ఇలా ప్రతి ఏటా 30 శాతం మేర అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తుంచారని చెప్పారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రబీ బియ్యంలో తెలంగాణ సర్కార్ 8.34 లక్షల మెట్రిక్ టన్నులు ఇంత వరకు అందజేయలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు కూడా వాటా ఉందని, ఇది వందల కోట్ల కుంభకోణమని రేవంత్​ ఆరోపించారు. ఈ విషయాలన్నింటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని, ఈ రైస్ అంతా ఎటు పోయిందని, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారా లేదా బ్లాక్​లో అమ్ముకుంటున్నారా అని స్వయంగా ఆయనే ప్రశ్నించారన్నారు. రాష్ట్రంలో బియ్యం కుంభకోణం జరుగుతోందని ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఎఫ్​సీఐకి చేరాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్​లో అమ్ముకుంటూ, రేషన్​ బియ్యన్ని రీసైక్లింగ్ చేసి ఎఫ్​సీఐకి సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3,200 రైస్​ మిల్లులున్నాయని, ఇందులో 900 మిల్లులను తనిఖీ చేస్తే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైందని చెప్పారు. ఎనిమిదేండ్లుగా ఈ తంతు జరుగుతోందన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ పని జరుగుతోందని అన్నారు. ఇంత పెద్ద కుంభకోణంపై స్పష్టమైన సమాచారం ఉన్నా ఇంకా ఎందుకు సైలెంట్​గా ఉన్నారని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. వెంటనే ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించి ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. బాధ్యులైన మిల్లులను సీజ్​ చేసి, రెవెన్యూ రికవరీ యాక్టు కింద ఇన్నేళ్ల దోపిడీ సొమ్మును వసూలు చేయాలని డిమాండ్ చేశారు.