V6 News

నాన్న వల్లే ఇలా ఉన్నాను..

నాన్న వల్లే ఇలా ఉన్నాను..

జూన్ 9 నుంచి భారత్-సౌతాఫ్రికా సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండటంతో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. అయితే ఈ సిరీస్లో పంత్తో పాటు..మరో ఇద్దరు వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్లు కూడా ఆడనున్నారు. సౌతాఫ్రికా టీ-20 సిరీస్ తర్వాత  ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లతో భారత్ టీ-20 సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత టీ-20 వరల్డ్ కప్ జరగనుంది. ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో..పంత్ వికెట్ కీపర్గా..బ్యాట్సమన్గా రాణించక తప్పని పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో తన కీపింగ్ కెరియర్ గురించి  పంత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

నాన్న వల్లే..
తాను వికెట్ కీపర్ అవడానికి కారణం నాన్నే అన్నాడు రిషబ్ పంత్. నాన్న కూడా వికెట్ కీపర్ కావడంతో..ఆయన్ను ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్, బ్యాట్సమన్ గా కెరియర్ మొదలు పెట్టానని చెప్పుకొచ్చాడు. తాను వికెట్ కీపింగ్ సరిగ్గా చేస్తున్నానో లేదో ప్రేక్షకులకే తెలియాలన్నాడు. అయితే ప్రతీ  మ్యాచ్ లో మాత్రం వంద శాతం ఎఫర్ట్ పెడతానని చెప్పాడు. అయితే ప్రస్తుతం టీమిండియాలో రాహుల్, దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ లాంటి వారు మంచి వికెట్ కీపర్లు ఉన్నారని తెలిపాడు. అయితే వారితో తనకేమి ముప్పు లేదని వెల్లడించాడు. 

వికెట్ కీపర్ ఎలా ఉండాలంటే..
వికెట్ కీపింగ్ చేయడం ఆశామాషీ వ్యవహారం కాదన్నాడు రిషబ్ పంత్. వికెట్ కీపర్కు ఏకాగ్రత అత్యంత ముఖ్యమని తెలిపాడు. ఫస్ట్ బాల్ నుంచి చివరి బాల్ వరకు అప్రమత్తంగా ఉండాలన్నాడు. ప్రతీ బాల్ను పట్టుకునేందుకు వందశాతం ప్రయత్నం చేయాల్సిందేనన్నాడు. మంచి వికెట్ కీపర్ కావాలంటే..ఎప్పుడు చురుగ్గా ఉండాలని చెప్పాడు. మనసును ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటేనే వికెట్ కీపర్గా రాణించగల్గుతామన్నాడు. ఏడాది పొడువునా తిరికలేని క్రికెట్ ఆడితే తనపై మానసిక ఒత్తిడి ఉంటుందని..అయితే దానిని ఎదుర్కొనేందుకు మనసును నిత్యం ప్రశాంతంగా ఉంచుకుంటానని పంత్ చెప్పుకొచ్చాడు. 

పంత్ కీపింగ్ రికార్డులు..
2017లో ఇంగ్లాండ్తో జరిగిన టీ-20 సిరీస్ ద్వారా తొలిసారి జాతీయ జట్టుకు రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏడాది ఇంగ్లాండ్పై టెస్టుల్లో..వెస్టిండీస్ పై వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఐదేళ్ల క్రికెట్ కెరియర్లో ఇప్పటి వరకు పంత్..43 టీ-20 మ్యాచులు ఆడి..13 క్యాచులు, 7 సంప్ట్స్ చేశాడు. అలాగే 24 వన్డేల్లో 19 క్యాచ్లు పట్టాడు. ఒకసారి స్టంప్ చేశాడు. అటు టెస్టుల్లో 30 మ్యాచులు ఆడితే..107 క్యాచులు, 11 సార్లు స్టంప్ చేశాడు.  ఇక ఐపీఎల్లో 98 మ్యాచుల్లో 64 సార్లు క్యాచులు పట్టి బ్యాట్సమన్ను పెవీలియన్ చేర్చాడు. 18 మందిని స్టంపౌట్ చేశాడు.