పెరుగుతున్న విద్యా ఖర్చులు, నిరుద్యోగం, పరీక్షల లీకులపై జెన్ జెడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా డిజిటల్ పోరాటం చేస్తోంది. లోపభూయిష్టమైన విద్యావ్యవస్త, నిరుద్యోగంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాక్రోచ్ జనతాపార్టీ పేరుతో దేశంలో విద్యావ్యవస్థ లోపాలను కడిగి పారేస్తోంది. బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం దేశంలో లక్షల రూపాయలు పోసి చదువును కొనాల్సి వస్తోంది.. ఉన్నత చదువులకు మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తిపాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. సరే అంత చదివినా.. ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో వస్తున్నాయా అంటే అదీ లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. గత నెలలో దేశ నిరుద్యోగ రేటు 5.1 శాతంగా ఉన్నది. ఏటా కొన్ని లక్షల మంది డిగ్రీలు, పీజీ పట్టాలు పట్టుకుని బయటకు వస్తున్నా.. ఆ మేర ఉద్యోగాలు ఉండడం లేదు. చదువుకు తగ్గ ఉద్యోగాలూ దొరకడం లేదు. దీంతో అన్ని లక్షలు ఖర్చు పెట్టాక కూడా ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ సీజేపీ ద్వారా నిలదీస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్ను కాల రాసేలా లీకేజ్ ముఠాలు పేపర్ ను అమ్ముకున్నాయి. పేపర్ కొని రాసినోళ్లకు మంచి ర్యాంకులు వస్తే.. కష్టపడి చదువుకున్నోళ్లకు మాత్రం ఆ ఫలితం కనిపించడం లేదు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. దీనిపైనా సీజేపీ గళం విప్పింది. ప్రభుత్వ అసమర్థతను సోషల్ మీడియాలో ఎండగడుతున్నది. లీకులు కాకుండా పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ నిలదీస్తున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేకుండా డిజిటల్ ఉదృతం చేస్తామంటూ సీజేపీ ద్వారా హెచ్చరించారు.
