తెలంగాణలో రక్తం పారిన రహదారులు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

తెలంగాణలో రక్తం పారిన రహదారులు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
  • అలియాబాద్​లోబైక్​ చెట్టుకు ఢీకొని ఇద్దరు.. 
  •     చేవెళ్ల పరిధిలో ముగ్గురు మృత్యువాత..
  •     దుండిగల్​లో ఒకరు.. వికారాబాద్​జిల్లాలో మరొకరు 

శామీర్​పేట్/ చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. జార్ఖండ్ కు చెందిన సుమిత్ కుల్లు (22), ఇతడి స్నేహితుడు కాస్మోస్ మార్కి (22) ఆదివారం తమ కంపెనీలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగిశాక బైక్​పై బయటకు వెళ్లగా అలియాబాద్ బృంద కన్వెన్షన్ హాల్ సమీపంలో  అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. 

ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామానికి చెందిన రైతు అలూరి కిష్టయ్య(42) బైక్​పై ఆలూరుకు వెళ్తుండగా.. మరో బైక్​ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కిష్టయ్య మృతిచెందగా.. మరొక వ్యక్తి మహిపాల్​కు గాయాలయ్యాయి. అలాగే, శంకర్​పల్లి మండలం సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య (48) ఆదివారం రాత్రి బైక్​పై సంగారెడ్డి వైపు వెళ్తున్నాడు. కంది బైపాస్‌‌‌‌లోని ల్యాంకో సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉన్న చోట బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతని తలపై నుంచి వెళ్లడంతో స్పాట్​లోనే చనిపోయాడు. అలాగే అలంఖాన్​ గూడ గ్రామానికి చెందిన భుజంగారెడ్డి (55) సోమవారం ఉదయం బైక్​పై వెళ్తుండగా, హుస్సేన్‌‌‌‌పూర్ వద్ద అదుపు తప్పి కిందపడడంతో చనిపోయాడు.  

మద్యం తాగి.. కారును ఢీకొట్టి..

కుత్బుల్లాపూర్/తాండూరు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన కావలి రాజేశ్​(30), పల్నాటి రాకేశ్ మిత్రులు. ఆదివారం కారులో గండిమైసమ్మకు వెళ్లి తిరిగొస్తుండగా రాత్రి గాగిల్లాపూర్​ లోని టాటా హిటాచీ కంపెనీ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన బొలేరో ఢీకొట్టింది. ఈఘటనలో కారు నడుపుతున్న రాజేశ్ మృతిచెందగా..రాకేశ్​కి తీవ్రగాయాలయ్యాయి. బొలేరో నడిపిన డ్రైవర్​ సేతు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వికారాబాద్ జిల్లా యాలాలకు చెందిన గొల్ల రాజశేఖర్ (32) ఆదివారం ట్రాక్టర్‌‌‌‌తో మొరం తరలిస్తుండగా..యాలాల శివారులోని కస్తూర్బా గాంధీ స్కూల్​మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ టైరు రాజశేఖర్ పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాండూరు ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్తుండగా మృతి చెందాడు.