ప్రాణభయంతోనే రౌడీషీటర్ నయీమ్ హత్య

ప్రాణభయంతోనే రౌడీషీటర్ నయీమ్ హత్య
  • 24 గంటల్లో 9 మంది నిందితుల అరెస్ట్
  •     పరారీలో మరో నలుగురు
  •     వివరాలు వెల్లడించిన మల్కాజిగిరి సీపీ

ఎల్బీ నగర్, వెలుగు: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ నయీమ్ హత్య కేసును మల్కాజిగిరి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వ్యక్తిగత కక్షలు, తమను చంపుతాడన్న తీవ్ర ప్రాణభయంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు సీపీ సుమతి తెలిపారు. బుధవారం ఎల్బీనగర్‌‌‌‌లోని క్యాంప్​ఆఫీస్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 

ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులు పాండిచ్చేరిలోని యానాంకు చెందిన సయ్యద్‌‌‌‌ రబ్బానీ, ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన పాత నేరస్థుడు ఓట్ల దినకర్, హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఉప్పుగూడకు చెందిన ఓలిపోల్ల మహేశ్, ఛత్రినాక - శివగంగ నగర్ కు చెందిన పాత నేరస్థుడు రాసుమల్ల సాకేత్, తార్నాకకు చెందిన పాత నేరస్థుడు అలకుంట వెంకట్, చాంద్రాయణగుట్ట ఉప్పుగూడకు చెందిన కొడిగంటి రాఘవేందర్, ఛత్రినాకకు చెందిన వల్లపుదాసు చరణ్‌‌‌‌గౌడ్, మహ్మద్‌‌‌‌ బద్రుల్లా హుస్సేన్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన తోడేటి వెంకటేశ్‌‌‌‌లను అరెస్ట్​చేశామన్నారు. ప్రధాన నిందితుడు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కనకం ఉమామహేశ్ అలియాస్ జేకే మహేశ్​తోపాటు మహ్మద్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌ జాబీ, భోలే, కార్తీక్‌‌‌‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి వేట కొడవలి, ఇనుప రాడ్, ఒక టయోటా వాహనం, రెండు బైక్​లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

హత్య వెనక అసలు కారణం

మృతుడు నయీమ్‌‌‌‌, ప్రధాన నిందితుడు ఉమా మహేశ్‌‌‌‌లతోపాటు మరికొందరు చిన్ననాటి స్నేహితులు. అయితే గత 3 నెలలుగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో, నయీమ్ నిత్యం వారిని బెదిరిస్తూ దూషించేవాడు. తమను చంపుతాడనే భయంతోనే నయీమ్‌‌‌‌ను అడ్డుతొలగించుకోవాలని కుట్ర పన్నారు. ఖమ్మంలో రహస్యంగా సమావేశమై వ్యూహం రచించిన నిందితులు, హైదరాబాద్‌‌‌‌లోని బండ్లగూడ సుప్రీమ్ వైన్స్ వద్ద నయీమ్‌‌‌‌ను అతికిరాతకంగా హత్య చేశారు. నయీమ్‌‌‌‌పై గతంలోనూ పలు పోలీస్‌‌‌‌స్టేషన్లలో రౌడీషీట్లు, క్రిమినల్ కేసులు ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు.