అన్ని రంగాల్లో ఎకానమీ పరుగులు.. యువతకు భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు : మోదీ

అన్ని రంగాల్లో ఎకానమీ పరుగులు.. యువతకు భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు : మోదీ
  • టాప్‌3 ఎకానమీగా ఇండియా ఈ దశాబ్దంలోనే ఎదుగుతది
  • రోజ్‌గార్‌‌ మేళాలో 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేత

న్యూఢిల్లీ/జమ్మూ : భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో దూసుకు పోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫలితంగా యువతకు భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. రోజ్‌గార్‌‌ మేళాలో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లను ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని వర్చువల్‌గా మాట్లాడుతూ.. ‘‘వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా ఇండియా అవతరించింది. ప్రపంచంలో టాప్‌–3 ఎకానమీగా ఈ దశాబ్దంలోనే ఎదుగుతుంది. సాధారణ ప్రజలకు ప్రయోజనాలను అందిస్తుంది. ఏ ఎకానమీ అయినా వృద్ధి చెందాలంటే.. ప్రతి రంగం అభివృద్ధి చెందాలి. ఫుడ్ సెక్టార్ నుంచి ఫార్మాస్యూటికల్స్‌ దాకా.. స్పేస్ నుంచి స్టార్టప్స్ దాకా.. అన్ని రంగాలు వృద్ధి చెందితేనే ఎకనామీ ముందుకు వెళ్తుంది” అని వివరించారు.

అన్ని సెక్టార్లు జూమ్

2030 నాటికి ఎకానమీలో కేవలం టూరిజం సెక్టార్ వాటానే రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని, 13 కోట్ల నుంచి 14 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పారు. ఇక ఫార్మసీ సెక్టార్ వాటా ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని అని అన్నారు. ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ సెక్టార్‌‌లోనూ గ్రోత్ ఎక్కువగా ఉంటుందని, దీన్ని బట్టి భారీగా యువత అవసరమని అన్నారు. ఇక గతేడాది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాటా రూ.26 లక్షల కోట్లుగా నమోదైందని, వచ్చే మూడున్నరేండ్లలో రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు.

గతేడాది ఎగుమతుల్లో రికార్డులు నమోదయ్యాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఇండియన్ మేడ్ గూడ్స్‌కు డిమాండ్ పెరిగిందనడానికి ఇది సంకేతమని అన్నారు. ఉత్పత్తి పెరిగిందని, ఉపాధి పెరిగిందని, దీంతో కుటుంబ ఆదాయమూ పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ మాన్యుఫాక్చరింగ్ దేశంగా ఇండియా అవతరించిందని, ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై దృష్టిపెట్టిందని వివరించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లతో మనం గర్వపడే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.

ఇదో జిమ్మిక్కు: కాంగ్రెస్

ఎన్నికల ఏడాది కావడంతో ఆ వేడిని ఎదుర్కొంటున్న ప్రధాని మోదీ.. తన ఇమేజ్‌ను కాపాడుకునేందుకు రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. రోజ్‌గార్‌‌ మేళాలు ఈఎంఐ (ఎంప్టీ మానిపులేటివ్ ఇన్‌స్టాల్‌మెంట్స్‌) అని ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ.. ఇప్పుడు ఈఎంఐల కింద కొన్ని వేలల్లోనే ఉద్యోగ నియామక లెటర్లను ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రోజ్‌గార్ మేళాలు అతి పెద్ద జుమ్లాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శించారు.

5.5 లక్షల ఉద్యోగాలిచ్చినం: కేంద్ర మంత్రి వర్మ

గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 5.5 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ చెప్పారు. ఈ ఏడాది ఆఖరుకల్లా మొత్తం 10 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో సాగుతున్నామని చెప్పారు. బీఎస్ఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రోజ్‌గార్‌‌ మేళాలో పలువురికి నియామక పత్రాలను అందజేశారు.