లోతైన చూపు... అచ్చం అడవి బిడ్డ లాంటి ఆహార్యం! ‘ఆదివాసీల అమ్మాయా? ఏంటి’ అని అందరూ ఆశ్చర్యపోయేలా ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ‘లోకి’ పాత్రలో జీవించింది అహ్మరీన్ అంజుమ్. మల్లి తల్లిగా సినిమాలో కనిపించింది కొన్ని సీన్స్‌లోనే... అయితేనేం అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఈ పాతికేండ్ల మోడర్న్ యాక్టర్ జర్నీ గురించి ఆమె మాటల్లోనే...
‘‘ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు నన్ను ‘లోకి’ గానే గుర్తిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజై ఇన్ని రోజులైనా... ‘లోకి’ పాత్రను అభినందిస్తూనే ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద సినిమాలో నటించాక ఏ యాక్టర్ అయినా అందరికీ తెలుస్తారు. నిజానికి ఆ గుర్తింపే అవకాశాలు తెచ్చిపెడుతుంది కూడా. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన ఫస్ట్‌డే నుంచి ప్రేక్షకులు నా మీద ప్రేమ కురిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి రోల్స్ చేయాలి అనుకుంటున్నా. స్క్రీన్ మీద ఎంతసేపు కనిపిస్తామనేది కాకుండా ఆ రోల్ ఎంత అద్భుతంగా ఉందనేదే చూస్తా.
ఆడిషన్ ఇచ్చి మర్చిపోయా
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘లోకి’ రోల్ కోసం 2017లో ఆడిషన్‌కి పిలిచారు. ఆడిషన్ ఇచ్చిన విషయమే మర్చిపోయా. ఏ ఆడిషన్‌కి వెళ్లినా... బెస్ట్ ఇవ్వడమే నా పని. అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అనే విషయం ఆలోచించను. ఇది కూడా అలాగే అనుకున్నా. రెండేండ్ల తర్వాత నా పేరు షార్ట్ లిస్ట్ అయిందని ఫోన్ వచ్చింది. అయితే అది ఏ ప్రాజెక్టో గుర్తుతెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డా. ‘లోకి’ అనే గోండు ట్రైబ్ పాత్ర, ఆ సినిమాను నడిపించడంలో ఎంత ముఖ్యమైందో తెలుసుకున్నాక.. పట్టలేనంత సంతోషం కలిగింది.
లోకి కోసం రీసెర్చ్ చేశా
నిజం చెప్పాలంటే నేను ‘లోకి’ రోల్ చేయడానికి ఎక్కువగా కష్టపడలేదు. ఎందుకంటే, షూటింగ్ మొదలు కావడంకంటే ముందే, లోకి పాత్ర ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అనే ఇన్ఫర్మేషన్ అంతా డిటెయిల్డ్గా పంపించారు నాకు. దాంతో వాళ్లు ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు?.. ఇలా ప్రతీ విషయం గురించి రీసెర్చ్ చేశా. లోకి పాత్ర సినిమాను ఎమోషనల్‌గా నడిపించే పాత్ర. కాబట్టి, లుక్‌తో పాటు ఎమోషన్స్ కూడా రియలిస్టిక్‌గా ఉండటం కోసం చాలా ప్రిపేర్ అయ్యా. అంతకుముందు హిందీ సినిమాల్లో చేశా. తెలుగు సినిమాలో చేయడం ఇదే మొదటిసారి. అందుకని ముందు భయపడ్డా. కానీ, షూటింగ్ మొదలవ్వడానికి ముందు రాజమౌళి సర్, రమా మేడమ్‌తో మాట్లాడాక ఆ భయం పోయింది.
మరిచిపోలేని రోజులు
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితాంతం అవి మధుర జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ‘ఆర్ఆర్ఆర్’ లో నా షూటింగ్ మొత్తం అడవిలో జరిగింది. పైన ఆకాశం, చుట్టూ పచ్చని చెట్లు తప్ప ఇంకేం కనిపించవు. ఫోన్ నెట్వర్క్ ఉండేది కాదు. కాబట్టి, ఫోకస్ మొత్తం యాక్టింగ్ మీదే. షూటింగ్లో మోటివేషన్ ఉండటం వల్ల, కొండ మీదినుంచి కిందికి పరుగెత్తుకుంటూ వచ్చి, యాక్షన్ సీన్స్ చేసినా అలసట తెలిసేది కాదు. పెద్ద డైరెక్టర్ రాజమౌళితో పని చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. టీం వర్క్‌కి ప్రాముఖ్యత ఇస్తే గొప్ప సినిమా తీయొచ్చనే విషయాన్ని రాజమౌళి సర్ని చూశాక అర్థమైంది. అమ్మానాన్నలతో కలిసి దుబాయ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చూశా. ‘మా ఫ్యామిలీలో ఇంత మంచి యాక్టర్ ఉందా?’ అనడం నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్.
యాక్టింగ్ అంటే ఇష్టం
నేను జార్ఖండ్‌లోని రాంచీలో పుట్టా. మా అమ్మా నాన్నలకు నేనొక్కదాన్నే. నాన్న సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. అమ్మ ప్రొఫెసర్, ప్రొఫెషనల్ సోషల్ వర్కర్. నా చిన్నప్పుడే మేం కోల్‌కతా షిఫ్ట్ అయ్యాం. నా చదువంతా కోల్‌కతాలోనే సాగింది. మహాదేవి బిర్లా శిశు విహార్‌లో స్కూలింగ్, సెయింట్ జేవియర్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ వీడియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశా. చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేదాన్ని. షారుక్ ఖాన్ డైలాగ్స్ గుర్తుంచుకొని చెప్తుండేదాన్ని. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. పదమూడేండ్ల వయసులో ఒక షార్ట్ ఫిల్మ్ తీశా. 21 ఏండ్లు వచ్చేటప్పటికే యాక్టర్ కావాలనుకున్నా. అందుకే దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకునేందుకు ‘రోషన్ తనేజ స్కూల్ ఆఫ్ యాక్టింగ్’లో డిప్లొమా కోర్సు చేశా. ఆ తర్వాత ఉషా గంగూలీ నడిపిన థియేటర్ గ్రూప్‌లో కొన్ని సంవత్సరాలు చేశా. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక, సినిమాల్లో నటించాలని ముంబై చేరుకున్నా.
కానీ, ఇండస్ట్రీలో తెలిసినవాళ్లు ఎవరూ లేరు. నా దగ్గర ఉంది టాలెంట్ మాత్రమే. దాన్నే పాలిష్ చేసుకోవాలి అనుకునేదాన్ని. ఆడిషన్ ఇచ్చిన 8 నెలల తర్వాత అడ్వర్టైజ్మెంట్లో చేసే అవకాశం వచ్చింది. నేను చేసిన మొదటి యాడ్ చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో చెప్పే పబ్లిక్ సర్వీస్ యాడ్. దాన్ని శిమిత్ అమిన్ డైరెక్ట్ చేశారు. అలా టెలివిజన్ కమర్షియల్స్, అడ్వర్టైజ్మెంట్స్ చాలా చేశా. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చా. నీళ్ల కరువు ఉండే ఊళ్లో ఆడవాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టిన ‘జల్ దానవ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశా. అది సెర్బియాలో జరిగిన ‘మార్టోవ్ స్కీ’ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అఫీషియల్‌గా సెలక్ట్ అయింది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, బిహారీ భాషలు వచ్చు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నా. నటనతో పాటు మోడలింగ్, సినిమాలు, టీవీ, స్టేజ్, యాడ్స్ ఇలా దాదాపు అన్నీ మీడియమ్స్‌లో పనిచేశా.
కొత్తవాళ్ల కోసం వర్క్ షాప్
కొవిడ్ లాక్డౌన్ అప్పుడు ఆర్టిస్టులంతా ఇంట్లోనే ఉండిపోయారు. అప్పుడు నా యాక్టర్ ఫ్రెండ్ డన్నీ సూరి, నేను కలిసి యాక్టింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాం. దాని పేరే ‘యాక్ట్ విత్ కాన్ఫిడెన్స్’. ఆన్లైన్ యాక్టింగ్ వర్క్ షాప్స్ ద్వారా కొత్త యాక్టర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడమే ఈ కంపెనీ పని. వాళ్లకు టీచ్ చేయడం వల్ల అందరం కలిసి నేర్చుకునే అవకాశం దొరికింది. రకరకాల కల్చర్స్ అర్థం అవుతున్నాయి. కొన్నాళ్ల తర్వాత మంచి కథలతో సినిమాలు డైరెక్ట్ చేస్తా.
వంట చేయడం ఇష్టం
ఇంట్లో ఉంటే ఖాళీటైంలో కిచెన్‌లో చాలా ప్రయోగాలు చేస్తుంటా. ఇండియన్, కాంటినెంటల్‌తో పాటు ఇటాలియన్ ఫుడ్ కూడా బాగా వండుతా. నేను చేసే వంటల్లో స్పెషల్ ‘దాల్ అర్హర్’. పొట్టుమినపప్పులో లెమన్ గ్రాస్ వేసి చేసే ఈ వంటకం మా ఫ్యామిలీకి చాలా ఇష్టం. మా అమ్మ చేసే స్పెషల్ చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం” అంది.
ఆయనో అద్భుతం
జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన యాక్టర్. సెట్లో చాలా క్రమశిక్షణతో ఉంటారు. గోండు జాతిని రక్షించే వీరుడు కొమురం బీమ్లా ఆయన ఒదిగిపోయిన తీరుకు ముచ్చటేసింది. సినిమాలో ఆయనతో నాకు ఒక్క సీన్ మాత్రమే ఉంది. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం ఒక గౌరవం నాకు.
ఆ మూవీస్ చేశాకే...
హిందీ రొమాంటిక్ మూవీ ‘సర్’ మూవీలో నేను చేసిన దేవిక రోల్‌కి క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. సర్ మూవీ 2018లో ముందుగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ తర్వాత యూరోప్ దేశాల్లో రిలీజయింది. ఆ తర్వాత 2020లో ఇండియాలో వచ్చింది. అందులో నేను చేసింది చిన్న రోల్. అయినా, చాలామందికి తెలిసిపోయా. ‘తొట్టా పటాక ఐటమ్ మాల్’ లో చేసిన సుర్మయి శర్మ రోల్ కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మెంటల్, జెండర్ ప్రాబ్లమ్స్ చూపించిన ‘దేవి అవుర్ హీరో’ మూవీలో భూ యజమాని సరిత, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘క్లాస్ ఆఫ్ 83’ లో శ్వేతగా చేశా. ‘తొట్టా పటాక ఐటమ్ మాల్’, ‘దేవి అవుర్ హీరో’ సినిమాల్లో నా యాక్టింగ్ చూసిన తర్వాతే డైరెక్టర్ రాజమౌళి నన్ను ఆర్ఆర్ఆర్ ఆడిషన్‌కి పిలిచారు.
::: గుణ
