సమస్యలు తీరాలంటే.. మనమే రాజులం కావాలె: ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్

సమస్యలు తీరాలంటే.. మనమే రాజులం కావాలె: ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్
  • రూ. కోట్ల ఆమ్దానీ కోసమే జీవో 111 రద్దు చేశారని విమర్శ
  • ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో ఎస్సీ 57 ఉపకులాల ధర్నా
  • సమస్యలు తీరాలంటే.. మనమే రాజులం కావాలె: ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్


ముషీరాబాద్, వెలుగు: స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎన్ని మారిన ఎస్సీ ఉపకులాల బతుకులు మారలేదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల జనాభా ఉన్నా.. సవరణల పేరుతో చట్టాలు మారుతున్నాయి తప్ప జీవితాలు మాత్రం బాగుపడలేదన్నారు. ‘‘దళిత బంధు కొరకు లొల్లి”పేరుతో ఎస్సీ 57 ఉపకులాల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే మనం గుర్తుకొచ్చి గూడెం, గుడిసెలోకి వచ్చి ఓట్లు దండుకొని గద్దెనెక్కాక మోసం చేస్తున్నారని.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బిర్యానీ, బీరుకు ఓటును అమ్ముకోవద్దని.. వేదికలపై వేషాలు వేసి కిరీటం పెట్టుకోవడం కాదు.. మనమే రాజులం కావాలని అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బుడగజంగాలు, సంచార జాతులకు ఇప్పటికీ కూడా ఇల్లు లేకపోవడంతో చీరతో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. రాజ్యాధికారంతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అని అంబేద్కర్ అంటే... అంబేద్కర్ 126 అడుగుల విగ్రహం, సెక్రటేరియెట్​కు అంబేద్కర్ పేరు పెట్టి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ కు ఎంతో ఉపయోగపడే జంట జలాశయాలను లక్షల కోట్ల రూపాయల ఆమ్దానీ కోసమే కేసీఆర్ జీవో 111 ను రద్దు చేశాడని ఆరోపించారు. 

దళిత బంధుపై ఎమ్మెల్యేల పెత్తనం తీసేయండి 

సీఎం కేసీఆరే స్వయంగా దళిత బంధులో ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకుంటున్నారని చెప్పారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. అలాంటప్పుడు దళిత బంధు స్కీం ఎమ్మెల్యేల చేతుల నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు కూడా వర్తింపచేయాలని కోరారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ దళిత బంధు ఉప కులాలకు కాదు మాల, మాదిగ కులాలకు కూడా కేసీఆర్ ఇవ్వడన్నారు. మనకు ఓటు హక్కు లేకపోతే ఏ రాజకీయ పార్టీ నేత పట్టించుకోరని ఓటు పవిత్రమైందని అమ్ముకోవద్దని సూచించారు. ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం మాట్లాడుతూ సంక్షేమ పథకాల కేటాయింపులో ఎస్సీ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దళిత బంధు పథకం పంపిణీలో ఎస్సీ 57 ఉప కులాలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉపకులాలకు కూడా దళిత బంధు స్కీం కేటాయించాలని లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు.