- అధిక వడ్డీ ఆశచూపి వసూళ్లు
- నిందితుడు భీమా నాయక్ అరెస్ట్
- బాధితుల్లో తహసీల్దార్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగులు
- నల్గొండ జిల్లాలో ఏడాదిలో బయటపడ్డ రూ.700 కోట్లకు పైగా మోసాలు
నల్గొండ, వెలుగు: ప్రజల అమాయకత్వం, ఆశను ఆసరా చేసుకొని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీ, పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో వందలాది మంది కోట్లలో నష్టపోతున్నారు. అధిక వడ్డీ పేరుతో నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన భీమా నాయక్ మరో భారీ మోసానికి పాల్పడ్డాడు. ఫామ్ లాండ్స్ లో పెట్టుబడులంటూ నమ్మించి వందలమంది నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి మొహం చాటేశాడు.
లక్షకు10 నుంచి 15 శాతం వడ్డీ
డిండి మండలం తబలా తండాకు చెందిన భీమా నాయక్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్ లలో పెట్టుబడులు పెడుతున్నానని, రూ.లక్షకు10 నుంచి 15 శాతం వడ్డీ చెల్లిస్తానని నమ్మించాడు. ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో పెద్దవూర మండలంలోని ఫాల్తీ తండాలో సుమారు 55 మంది రూ.7 కోట్ల వరకు అతడికి ఇచ్చారు. మొదట నెల నెలా క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించడంతో మరికొంత మంది అప్పులు తెచ్చి మరి భీమా నాయక్ కు ముట్టజెప్పారు. నల్గొండ జిల్లాలోని సాగర్, హాలియా, పెద్దవూర, డిండి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు చెందిన వందల మంది నుంచి భీమా నాయక్ రూ.100 కోట్లకు పైగా తీసుకున్నట్లు తెలిసింది. ఈ సొమ్ముతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్లాండ్స్తో పాటు విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన కార్లు కొని జల్సా చేస్తున్న భీమానాయక్.. కొన్ని నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో పలువురు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో పరారయ్యాడు. తాము మోసపోయినట్టు గ్రహించిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శనివారం రాత్రి హైదరాబాద్ లో భీమానాయక్ ను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. భీమానాయక్ బాధితుల్లో ఒక తహశీల్దార్‌తో పాటు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిసింది.
ఏడాదిలో 700 కోట్లకు పైగా మోసాలు
నల్గొండ జిల్లాలో ఈ ఏడాదిలో దాదాపు రూ.700 కోట్లకు పైగా మోసాలు జరిగాయి. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఎక్కువ వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. పీఏ పల్లి మండలం పలుగు తండాకు చెందిన బాలాజీ నాయక్ ఏజెంట్లను నియమించుకొని మరీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా పెట్టుబడులు సేకరించాడు. హైదరాబాద్ కేంద్రంగా టూవెల్త్ క్యాపిటల్స్ సర్వీసెస్ అనే సంస్థ ఏర్పాటు చేసిన బాలాజీ నాయక్ సుమారు మూడు వేల మంది నుంచి దాదాపు రూ.330 కోట్లకు పైగా వసూలు చేశాడని చెప్తున్నారు.
