- పలువురికి తీవ్రగాయాలు
ఇంద్రవెల్లి (ఉట్నూర్), వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి సుమారు 15 అడుగుల లోతైన వాగులో పడింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా, పలువురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సు ఉదయం ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు బయలుదేరింది.
శ్యాంపూర్ గ్రామం వద్ద ఉన్న ఇరుకు బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి వాగులో పడిపోయింది. ప్రమాదంలో కండక్టర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఉట్నూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
తరచూ ప్రమాదాలు..
శ్యాంపూర్ గ్రామంలోని బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో ఒకేసారి రెండు వాహనాలు వెళ్లే వీలు లేదని, అందువల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే కొత్త వంతెన నిర్మించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
