
హైదరాబాద్ లో బోనాల పండుగ విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మిగతా ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎల్బీ నగర్ లోని చింతల కుంటలోని ఓ ఫ్యామిలీ బోనాల పండుగ సందర్భంగా తెచ్చుకున్న చికెన్ , బోటి కూరను తెల్లవారు జామున తిన్నారు. దీంతో ఒకే కుటుంబంలోని 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. మిగతా ఏడుగురు కుటుంబ సభ్యులు చింతల కుంటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబం తిన్న ఆహారం శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు.