ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్ చేతివాటం

ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్ చేతివాటం

పెద్ద మొత్తంలో పక్కదారి పడుతున్న నగదు

అర్ధరాత్రి గుట్టుగా డబ్బులు తీసుకెళుతుండగా పట్టుబడిన తాత్కాలిక సిబ్బంది

ఆర్టీసీ కార్మికులు నిలదీయగా బయట పడిన విస్తుపోయే నిజాలు

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై నేటికి 33 రోజులు అవుతుంది. సీఎం కేసీఆర్ ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా కార్మికులు మాత్రం సమ్మె విరమించడం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న కారణంతో ప్రభుత్వం.. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తుంది. దీన్ని అదునుగా భావించి చాలామంది కాంట్రాక్ట్ కార్మికులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి ఆర్టీసీ సొమ్మును కాజేస్తున్నారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అటువంటి సంఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలో ఎం.డీ. అహ్మద్, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు తాత్కాలిక కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు విధులు ముగిసిన తర్వాత బస్సులో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఒక కవర్‌లో ఉంచి ప్రహరీ గోడ పైన పెట్టి బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్తున్నారు. అది గమనించిన ఆర్టీసీ కార్మికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి వద్ద దొరికిన కవర్లలో ఉన్న డబ్బులను లెక్కించగా అవి 15 నుంచి 20 వేల రూపాయలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వారిని పోలీసులు ప్రశ్నించగా.. గత 32 రోజుల నుంచి ఈ తంతు జరుగుతోందని, అధికారులు చెప్తేనే తాము ఈ డబ్బులు చాటుగా తీసుకెళుతున్నట్లు తెలిపారు.

తాత్కాలిక సిబ్బంది ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నట్లు బయటపడటంతో.. రోజూ వారి కలెక్షన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటూ, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజరు యేసు తెలిపారు.

ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. తాత్కాలిక సిబ్బంది ఇలా వేల రూపాయలు డిపో బయటకు తీసుకెళ్లడం కష్టమని.. అధికారుల అండదండలు లేనిదే ఇది సాధ్యపడదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. సమ్మెకాలంలో వస్తున్న ఆదాయంపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో.. తాత్కాలిక కార్మికలు ఆర్టీసీని మరింత నష్టాల పాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తగు విచారణ జరిపి, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని ఆర్టీసీని కాపాడాలని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.