వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కేవలం బస్సు ఆపలేదన్న నెపంతో కొందరు యువకులు రెచ్చిపోయారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై నడిరోడ్డుపైనే దాడికి తెగబడ్డారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే..?
తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా.. మార్గమధ్యంలోని పెద్దతండా వద్ద బస్సు ఆపలేదని ఇద్దరు యువకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతే.. వెంటనే తమ ద్విచక్రవాహనంపై బస్సును వెంబడించారు. సినిమా ఫక్కీలో బైక్‌పై ఛేజ్ చేస్తూ.. అన్నారం గ్రామం వద్దకు రాగానే బస్సుకు అడ్డంగా బైక్ పెట్టి నిలిపివేశారు.
బస్సు ఆగగానే లోపలికి దూసుకెళ్లిన యువకులు.. డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. బస్సు ఎందుకు ఆపలేదంటూ బూతులు తిడుతూ, డ్రైవర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. ప్రయాణికులు చూస్తుండగానే ఈ ఘర్షణ జరిగింది. ఈ ఊహించని దాడితో షాక్‌కు గురైన బస్సు డ్రైవర్.. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పర్వతగిరి పోలీసులు.. డ్రైవర్‌పై దాడికి తెగబడ్డ ఆ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
