జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో జనాభా వృద్ధి రేటు మందగించింది. గడిచిన 15 ఏండ్లలో జిల్లా వ్యాప్తంగా కేవలం 6 శాతమే జనాభా పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. చిన్న కుటుంబాలపై ఆసక్తి చూపడంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం జనం పట్టణాలకు వలస వెళ్లడం వల్ల జిల్లాలో జనాభా బాగా తగ్గిపోయిందని భావిస్తున్నారు.
2011లో 16వ జనగణన, 2024లో కుటుంబ సర్వే..
దేశవ్యాప్తంగా 2011లో కేంద్ర ప్రభుత్వం 16వ జనగణన నిర్వహించింది. ప్రతీ పదేండ్లకు ఒకసారి జనగణన నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా 2021లో నిర్వహించలేదు. 2027లో 17వ జనగణన నిర్వహించనున్నారు. 2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 1,31,395 ఇండ్లు ఉండగా, జనాభా 5,34,991 ఉంది. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 1,77,124 ఇండ్లు ఉన్నాయని తేలగా, జనాభా 5,45,449కి చేరింది. అయితే ఈ సర్వేలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వచ్చి పాల్గొన్నారు.
ఇండ్లు 1,84,439..
జనగణన 2027లో భాగంగా ప్రారంభమైన ఇండ్ల గణన ముగిసింది. ఈ గణనలో ఇండ్లను లెక్కించడంతో పాటు కుటుంబ సభ్యులను ఎన్యూమరేటర్లు లెక్కించారు. ఒకే కాంపౌడ్ వాల్ లోపల ఉన్న వారిని ఒకే ఫ్యామిలీగా పరిగణించి, మెంబర్స్‌ను మాత్రం విడిగా లెక్కలు వేశారు. ఈ లెక్కల ప్రకారమే ఇండ్ల సంఖ్య 1,84,439కి చేరగా జనాభా 5,66,689కి చేరింది. కాగా, ఈ సర్వేలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
జనాభా వృద్ధి 6 శాతమే..
ఈ మూడు సర్వేలను నిశితంగా పరిశీలిస్తే 2011 నుంచి 2026 వరకూ ఈ 15 ఏండ్లలో ఓవరాల్‌గా కేవలం 31,698 జనాభా మాత్రమే పెరిగింది. ఈ లెక్కన 6 శాతమే జనాభా వృద్ధి పెరిగినట్టుగా తేలింది. ఆశ్చర్యకరంగా 2011లోని 16వ జనగణన, 2024లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో అంటే 13 ఏండ్లలో కేవలం 10,458 మంది జనాభా మాత్రమేపెరిగింది. ఈ లెక్కన కేవలం 2 శాతం కంటే తక్కువగా జనాభా వృద్ధి పెరిగినట్టుగా కన్పిస్తోంది.
చిన్న కుటుంబాలు.. వలసలే కారణం
జిల్లాలో జనాభా వృద్ధి తగ్గిపోవడానికి ప్రజలు చిన్న కుటుంబాలపై ఆసక్తి చూపడం ప్రధాన కారణంగా గుర్తిస్తున్నారు. పెండ్లి అయిన జంటల్లో ఎక్కువ మంది ఒక్కరు చాలని భావిస్తున్నారు. కుటుంబ పెద్దల నుంచి తీవ్ర వత్తిడి వస్తేకాని ఇద్దరు పిల్లల వైపు మొగ్గు చూపడంలేదు. దీనికి తోడు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడం మరో కారణమైంది.
హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ఈ 15 ఏండ్లలో దాదాపు 1.20 లక్షల మంది జన్మించారు. మొత్తంగా 25 వేల మందికి పైగా మరణించారు. ఈ లెక్కన జిల్లా జనాభా 6,24,991 చేరాల్సి ఉంది. దీనికితోడు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని కలుపుకుంటే మరింత జనాబా పెరగాల్సి ఉంటుంది. కానీ కేవలం 31,698 మంది పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి.
జనగామ జిల్లాలో మూడు సర్వేల వివరాలు
సంవత్సరం 2011 2024 2026
ఇండ్లు 1,31,395 1,77,124 1,84,439 జనాభా 5,34,991 5,45,449 5,66,689
