హనుమకొండ, వెలుగు: 'సర్' ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల ఆఫీసర్ల సహకారం కీలకమని, ఈ మేరకు అందరూ సమన్వయంతో పని చేయాలని స్టేట్ ఎలక్టోరల్ అబ్జర్వర్ దాసరి హరిచందన అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో శనివారం టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ కలెక్టర్లు, ములుగు అడిషనల్ కలెక్టర్, వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రతినిధులకు సర్ ప్రక్రియపై సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలన్నారు. అర్హులైన ప్రతి ఓటరు సర్ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 55.60 శాతం ఎస్‌ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయిందన్నారు. దానిని స్పీడప్ చేసేందుకు ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, బీజేపీ ప్రతినిధి నిశాంత్, బీఆర్ఎస్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
గడువులో పూర్తి చేయాలి..
సర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని దాసరి హరిచందన ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై రివ్యూ చేశారు. అనంతరం బాలసముద్రం శ్రీనివాస్ కాలనీ, హంటర్ రోడ్డులోని దీన్ దయాళ్ నగర్ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రజలకు అందిస్తున్న సేవలు, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు ప్రక్రియ, డిజిటలైజేషన్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శాశ్వతంగా నివాసం మారిన వారు, వలస వెళ్లిన వారు, ఓటరు జాబితాలో మార్పులు చేయించుకోవాల్సిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్లు ఆయా జిల్లాల 'సర్' పురోగతిని వివరించారు. సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డా.సత్య శారద, రాహుల్ శర్మ, స్నేహ శబరీశ్, ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, అడిషనల్ కలెక్టర్లు, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
