- అంతరిక్షంలోకి పంపిన తొలి భారతీయ సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్
- కరీంనగర్‌కు చెందిన యువ ఇంజినీర్ కత్రోజు రోహిత్ కీలక పాత్ర
కాశీబుగ్గ/కరీంనగర్, వెలుగు: వరంగల్ జిల్లాకు చెందిన సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ అరుదైన ఘనత సాధించారు. సూక్ష్మ శిల్పాలను అంతరిక్షంలోకి పంపిన తొలి భారతీయ శిల్పిగా ఆయన నిలిచారు. సూది రంధ్రంలో పట్టేంత చిన్న పరిమాణంలో రూపొందించిన డాక్టర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిరూపాలు శనివారం స్కైరూట్ ఏరో స్పేస్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి చేరాయి. అజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. విక్రమ్–1 తయారీలో కరీంనగర్‌కు చెందిన యువ ఇంజినీర్ కత్రోజు రోహిత్ కీలక పాత్ర పోషించారు.
