అడుగంటిన బావుల్లో భగీరథ యత్నం.. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో కొత్త బావులు, బోర్లపై రైతన్నల దృష్టి

అడుగంటిన బావుల్లో భగీరథ యత్నం.. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో కొత్త బావులు, బోర్లపై రైతన్నల దృష్టి

కరీంనగర్/శంకరపట్నం, వెలుగు: వర్షపాత లోటుతో కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ బావులు అడుగంటుతున్నాయి.. బోర్లు వట్టిపోతున్నాయి.. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఈసారి కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో రైతన్నలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పాత బావుల్లో పూడిక తీయిస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి మరీ కొత్త బావులు తవ్వడంతోపాటు బోర్లు వేయిస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సాగునీటి కోసం తిప్పలు ఉండేవని, కానీ ఈసారి వానాకాలంలోనే ఎండాకాలాన్ని తలపిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పూడికతీతపై రైతుల దృష్టి

ఒకవైపు మెట్ట పంటలు వేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు చెప్తున్నప్పటికీ.. రైతులు మాత్రం వరి నార్లు పోస్తున్నారు. ఈ సారి లోయర్ మానేరు డ్యామ్, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్పీ వరద కాల్వ నుంచి ఆశించిన స్థాయిలో సాగునీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వరికి తగినంత నీరందించాలనే ఉద్దేశంతో బావుల్లో ఊట పెరిగేలా క్రేన్లతో పూడిక తీస్తున్నారు. కొందరు కొత్తగా బావులు తవ్వడంతోపాటు బోర్లు వేయిస్తున్నారు. ఒక్కొక్కరు పూడికతీత కోసం లోతును బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొత్త బోర్లు వేసేందుకు జియాలజిస్టులను సంప్రదిస్తున్నారు. 

పడిపోతున్న భూగర్భజలాలు 

సకాలంలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో జులై18 నాటికి 243.5 మి.మీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. 135.8 మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 44 శాతం లోటు ఉండడంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. 

గంగాధర మండలంలో అత్యధికంగా 16.99 మీటర్ల లోతుకు వెళ్లగా.. కరీంనగర్ అర్బన్ మండలంలో 15.04 మీటర్లు లోతుకు, చొప్పదండి మండలంలో 13.46 మీటర్లు, తిమ్మాపూర్ మండలంలో 10.48, రామడుగు మండలంలో 10.28 మీటర్లు, చిగురుమామిడి మండలంలో 9.71 మీటర్ల లోతుకు వెళ్లాయి. కరీంనగర్ రూరల్ మండలంలో మాత్రమే 4.21 మీటర్ల లోతులో ఉన్నాయి.   

కోతుల వల్ల మెట్ట పంటలు సాగుచేయట్లే..

ఈ సారి వర్షాలు సరిగ్గా పడవని, కరువు వచ్చేలా ఉందని అధికారులు చెప్తున్నారు. మెట్ట పంటలు వేయాలంటున్నారు. కానీ కోతుల భయానికి ఆ పంటలు వేయడం లేదు. అందుకే వరే వేయాలనుకుంటున్నా. నాకున్న వ్యవసాయ బావిలో ఊట కోసం అప్పు చేసి బావిలో పూడిక తీయించాల్సి వస్తుంది. 
- సదానందం,  రైతు, ధర్మారం, శంకరపట్నం మండలం, కరీంనగర్