- తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్
కాగజ్‌నగర్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని పాత అనుమతులతో వెంటనే ప్రారంభించాలని తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్, ప్రాణహిత సాధన కమిటీ కన్వీనర్ నైనాల గోవర్ధన్ డిమాండ్ చేశారు. శనివారం తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది వద్ద ప్రాణహిత ప్రాజెక్టు సాధన కమిటీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. రీడిజైన్ పేరుతో భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కక్కుర్తి కారణంగా దెబ్బతిని ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం నిర్మించారని, ప్రాజెక్టు ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ప్రధాన ప్రాజెక్టుతో పాటు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల్లో లీకేజీలు, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు.
దీంతో ప్రస్తుతం నీటిని నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా స్పష్టం చేసిందన్నారు. అప్పటి మంత్రులపై కేసులు నమోదు చేసి, అవినీతి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, దీనికి గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఎం నాయకుడు ప్రకాశ్, ముంజం ఆనంద్‌కుమార్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్‌కుమార్ పాల్గొన్నారు.
