
సకల జనుల సమ్మె తర్వాత అంత పెద్ద బంద్ ఇదే
ప్రభుత్వం చర్చలకు ఇప్పటికైనా పిలవాలి
కోర్టు చెప్పినట్టే ప్రజా మద్దతు మాకు పెరుగుతోంది
ప్రజల సంస్థ ఆర్టీసీ ఆస్తులు కాపాడేేందుకే మా పోరాటం
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి కామెంట్స్
రాష్ట్రంలో బంద్ విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. హైదరాబాద్ లోని విద్యానగర్ – ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ లో ఆర్టీసీ జేఏసీ శనివారం సాయంత్రం సమావేశం అయింది. బంద్ జరిగిన తీరుపై చర్చించింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి.. బంద్ కు సహకరించిన సబ్బండ వర్గాలు, ప్రజాసంఘాలు, పార్టీలు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రేపు ఆదివారం రాజకీయ పార్టీలతో ఉదయం 11.30 గంటలకు సమావేశం అవుతామని.. ఆ తర్వాత మరో 2 రోజుల కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
“ప్రభుత్వం చర్చలకు పిలవాల్సి ఉండె. కానీ పిలవలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేందుకు చేస్తున్న పోరాటం ఇది. సకల జనుల సమ్మె తర్వాత ఈ ఆరేళ్లలో జరిగిన పెద్ద బంద్ ఇదే. ప్రభుత్వం వాస్తవాలు తెల్సుకోవాలి. మంత్రుల కమిటీనా, యాజమాన్య కమిటీనా ఏదో ఒకటి వేసి సమస్య పరిష్కరించాలి. లేకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తాం”అన్నారు.
“రేపు ఆదివారం అన్ని కూడళ్లలో ప్లేకార్డ్స్ పట్టుకుని ప్రజలను కలుస్తాం. “ఆర్టీసీని రక్షించండి.. ప్రజారవాణాను కాపాడండి..” “గ్రామగ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి.. ”, “ఓ ప్రభుత్వమా.. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవా…” అంటూ మా 5 ప్రధాన డిమాండ్లతో నినాదాలు చేస్తాం. ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ సంఘాలు, పార్టీలు అందరికీ జేఏసీ తరఫున వందనం”అన్నారు.