- ఉద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపు
- కార్మికులు నిరసనలు విరమించుకోవాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో సెక్రటేరియేట్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని కోరుతూ తాము ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చామని, దీనికి పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఒకవేళ ఆర్టీసీ ఉద్యోగుల నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కార్మికులు ఎక్కడి బస్సులను అక్కడే వదిలేసి విధులను బహిష్కరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం ఉదయం ఇందిరా పార్కు వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి చలో సెక్రటేరియట్ కు ర్యాలీగా వెళ్దామని ఆయన సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసమే తమ ఈ నిరసన అని ఆయన స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నం: పొన్నం
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ నిరసన కార్యక్రమాలను విరమించుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, చివరకు ఆర్టీసీని మూసివేసే కుట్ర చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చామన్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 21 శాతంతో పేస్కేల్ ఇచ్చామని, ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇచ్చామని, ఇందులో 2 వేల ఉద్యోగాల నియామకం పూర్తయిందన్నారు.
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న 1,132 కారుణ్య నియామకాలు చేపట్టామని, 2013 కు సంబంధించిన రూ. 280 కోట్ల పే స్కేల్ బాండ్స్ క్లియర్ చేశామని పొన్నం వివరించారు. పీఎఫ్ కు సంబంధించిన రూ. 1355.4 కోట్ల బకాయిలు ఉండగా, రూ.660.50 కోట్లు చెల్లించామని, సీసీఎస్ కు రూ.664.5 కోట్లు బకాయిలు ఉంటే రూ.300 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి కార్మికుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఈ విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పొన్నం విజ్ఞప్తి చేశారు.
