- ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్
- 31 న యూనియన్ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. గుర్తింపు సంఘాన్ని సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ
మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ కోసం కార్మిక శాఖ నలుగురు అధికారులను నియమించింది. ఈ నెల 31న ఉదయం 11.30 గంటల నుంచి యూనియన్ల డాక్యుమెంట్లు, సభ్యుల వివరాలు, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
డిప్యూటీ కమిషనర్లు కె. రవీందర్ రెడ్డి, బి. జేసన్, అసిస్టెంట్ కమిషనర్ ఎస్. మానస, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె. పవన్ ఈ పరిశీలన చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్), ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), కార్మిక్ సంఘ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్తు యూనియన్లు ఉన్నాయి. వీటి డాక్యుమెంట్లు, సభ్యుల సంఖ్యను అధికారులు పరిశీలించి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు.
