
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైల్వే గేట్ దగ్గర రాస్తారోక్ చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికులను పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చకుంటూ వెళ్లడంతో మహిళా కండక్టర్ స్పృహ తప్పి పడిపోయింది.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ కామారెడ్డి బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. దీంతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయడంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మికులు.
మహబూబ్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల నిరసన ఉద్రిక్తంగా మారింది. బస్సులను అడ్డగించిన కార్మికులు…విధుల్లో చేరిన వారిపై దాడికి దిగారు. బస్సులోంచి కండక్టర్, డ్రైవర్ ను బయటకు లాగి కొట్టారు. చెప్పులతో కొడుతూ దాడికి దిగారు. విధుల్లో చేరిన కార్మికుల ఫ్లెక్సీలు పెట్టి.. చెప్పుల దండలు వేసి ర్యాలీ చేశారు. విధుల్లో చేరిన కార్మికులపై దాడిని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు వచ్చిన కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో.. డిపోముందు బైఠాయించి నిరసన తెలిపారు.