సేఫ్టీకి ఫార్ములా
ఇప్పుడు దాదాపుగా అన్ని షాపులు తెరుచుకున్నాయి. జనం కూడా ఎవరి పనుల్లో వాళ్లు తిరుగుతున్నారు. కమ్యూనిటీతో కలిసి ఉంటున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ మనదాకా రాకుండా సేఫ్‌గా ఉండాలంటే ‘5C’ ఫార్ములాను ఫాలో అవ్వాలని నిపుణులు చెప్తున్నారు. కాంటాక్ట్, క్రౌడ్, కన్‌ఫైన్‌మెంట్, కేర్, చాయిసెస్.. ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగాఉండాలంటున్నారు.
ఇప్పుడు ఎవరికి వాళ్లు జాగ్రత్తగా ఉండడం తప్ప మరో దారి లేదు. ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. సేఫ్టీ కోసం ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న ‘5C’ ఫార్ములా ఏంటంటే..
కాంటాక్ట్
బయటకు వెళ్లినప్పుడు తెలియకుండా చేతులు చాలా వాటిని ముట్టుకుంటాయి. సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, హెయిర్ సెలూన్స్.. ఇలా ఎక్కడికి వెళ్లినా కాంటాక్ట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎంత మాస్క్ పెట్టుకుని తిరిగినా.. ఎంత ఫిజికల్ డిస్టెన్స్ పాటించినా.. అడపాదడపా చేతితో దేన్నో ఒక దాన్ని ముట్టుకోకుండా ఉండలేము. అందుకే చేతులకు ఎప్పుడు టచ్ పాయింట్ వస్తుందో గమనిస్తూ ఉండాలి. షాపులోనో, రెస్టారెంట్‌లోనో దేన్నైనా ముట్టుకోగానే.. వెంటనే చేతిని శానిటైజ్ చేసుకోవాలి. అలా ఎప్పుడు టచ్ పాయింట్ వస్తే అప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. డోర్ హ్యాండిల్స్, ప్లాస్టిక్ కవర్స్, కారు డోర్స్, బైక్ హ్యాండిల్స్.. ఇలా దేన్ని ముట్టుకున్నా.. అదొక టచ్ పాయింట్ కింద గుర్తుంచుకోవాలి. ప్రతి టచ్ పాయింట్‌కి శానిటైజ్ చేసుకోవాలి. కాంటాక్ట్ ద్వారా వైరస్ రాకూడదంటే ఇదొక్కటే దారి. అలాగే చేతులతో ముఖానికి కూడా ‘నో కాంటాక్ట్’. అంటే చేతులకు బయట కాంటాక్ట్ ఎలా తగ్గిస్తున్నామో.. చేయి ముఖానికి కాంటాక్ట్ అవ్వకుండా కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. వైరస్ నోరు, ముక్కు ద్వారానే మనలోకి ప్రవేశిస్తుందనే విషయం అస్సలు మర్చిపోకూడదు.
కన్‌ఫైన్‌మెంట్
కన్‌ఫైన్‌మెంట్ ఏరియాలు అంటే.. చుట్టూ మూసి వేసి ఉన్న గదులు, ఇండోర్ స్టేడియం, ఆఫీస్ గదులు, రెస్టారెంట్లు లాంటివి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. కన్‌ఫైన్‌మెంట్ ఏరియాల్లో గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. అక్కడ ఉండే గాలి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కరోనా వైరస్.. గాలి ప్రసరిస్తూ ఉండే ఏరియాల్లో ఎక్కువసేపు నిలవదు. ఎయిర్ ఫ్లో ఉంటే వైరస్ డైల్యూట్ అవుతుంది. అందుకే ఎప్పుడూ గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండాలి. కన్‌ఫైన్‌మెంట్ ఏరియాల్లో ఉన్నప్పుడు ఎవరైన దగ్గినా, తుమ్మినా.. ఆ తుంపరలు అక్కడే గాలిలో తిరుగుతూ ఉంటాయి. అందుకే వీలైనంత వరకూ క్లోజ్డ్‌గా ఉన్న గదులు, ఏరియాల్లోకి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్తే.. కచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం, తలుపులు, కిటికీలకు దగ్గరగా ఉండడం, ఎక్కువసేపు ఉండకుండా త్వరగా అక్కడి నుంచి బయటపడడం చేయాలి. గాలి ద్వారా వైరస్ సోకకూడదంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
చాయిస్
చాయిస్.. అంటే మన ఎంపికలు. మనం ఎంచుకునే ఆప్షన్స్, తీసుకునే డెసిషన్స్‌ను బట్టి కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. రోజువారి లైఫ్‌స్టైల్‌కు సంబంధించి రోజూ ఎన్నో చిన్నచిన్న డెసిషన్స్ తీసుకుంటుంటాం. ఏది కొనాలి? ఎక్కడికి వెళ్లాలి? ఏ పని ఎప్పుడు చేయాలి? ఇలా ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. అయితే వాటన్నింటిలో ఎందులో రిస్క్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉందో గుర్తించాలి. దాన్ని బట్టి తీసుకునే నిర్ణయాల్లో మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. పొద్దున్నే వెళ్తే మార్కెట్‌లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వెళ్దామంటే వేరే పనేదో ఉంది. ఇక్కడ ఏ పనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ డెసిషన్‌లో రిస్క్ తక్కువగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన హెల్త్ కండిషన్, ఆ ఏరియాలో వైరస్ వ్యాప్తి, మన ప్రయారిటీస్.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డెసిషన్స్ తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండడం అనేది ముందుగా మనం తీసుకునే నిర్ణయాల నుంచే మొదలవుతుంది. అందుకే ఎంపికలు, ప్రయారిటీస్ విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కేర్
వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైరస్‌ను ఎదుర్కొనేందుకు కూడా శరీరాన్ని సిద్ధం చేయాలి. అంటే ఆరోగ్యం పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. పొగతాగడం లాంటి అలవాట్లు మానుకోవాలి. ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా.. వెళ్లడానికి హాస్పిటల్స్ అంతగా అందుబాటులో లేవు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా అక్కడ వైరస్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ ఆరోగ్యంగా ఉండడం మంచిది. మనతో పాటు మన ఇంట్లో వాళ్ల పట్ల కూడా కేర్ తీసుకోవాలి. అలాగే వైరస్ వార్తలు విని ఆందోళన పడడం కూడా అంతమంచిది కాదు. మన జాగ్రత్తల్లో మనం ఉంటూ.. పాజిటివ్‌గా ఆలోచిస్తేనే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం.
క్రౌడ్స్
ఇకపోతే అన్నింటికంటే ప్రమాదకరమైంది క్రౌడ్స్. అంటే జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు. ఈ టైంలో చుట్టూ ఎంత ఎక్కువమంది ఉంటే అంత ఎక్కువ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. రోజువారీ పనుల్లో క్రౌడ్‌ను ఎంత స్కిప్ చేయగలిగితే అంత సేఫ్. తప్పని పరిస్థితుల్లో క్రౌడ్ ఉన్న ప్లేసులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీలైనంతవరకూ ఎవరినీ ముట్టుకోకుండా దేన్నీ తాకకుండా జాగ్రత్త పడాలి. ముందు చెప్పినట్టుగా.. మాస్క్ పెట్టుకోవడం, ప్రతి టచ్ పాయింట్‌కు శానిటైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అలాగే క్రౌడ్స్ ఉన్న ప్రదేశాల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఇప్పుడిప్పుడే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే క్రౌడ్స్‌లో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
