- వ్యక్తుల ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదం..
- ‘రూల్ ఆఫ్ లా’ ప్రజాస్వామ్యానికి పునాది..
- ‘రూల్ ఆఫ్ మెన్’కు చోటులేదు
- రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరమైన వ్యవస్థను ఏ అధికార హోదా అధిగమించలేదు
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- 56 పేజీల్లో తీర్పు వెల్లడించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో వ్యక్తుల ఆధిపత్యం అత్యంత ప్రమాదకరమని, చట్టబద్ధ పాలన కావాలి తప్ప వ్యక్తుల పాలన కాదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరమైన వ్యవస్థను ఏ అధికారి వ్యక్తిగత నిర్ణయాలు, అధికార హోదా లేదా పరిపాలనా చర్యలు అధిగమించలేవని పేర్కొంది. ‘రూల్ ఆఫ్ లా’నే ప్రజాస్వామ్యానికి పునాది అని, ‘రూల్ ఆఫ్ మెన్’కు రాజ్యాంగబద్ధ పాలనలో చోటు లేదని తేల్చిచెప్పింది.
కోర్టుకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, న్యాయస్థాన ఆదేశాలను కావాలనే అమలు చేయకపోవడం చట్టపాలనను దెబ్బతీసే చర్యలేనని వ్యాఖ్యానించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ జులై 27న వెలువరించిన 56 పేజీల తీర్పు ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో న్యాయవ్యవస్థ గౌరవం, చట్టపాలన ప్రాధాన్యం, ప్రభుత్వ అధికారుల బాధ్యతలపై కోర్టు విస్తృతంగా విశ్లేషించింది. ఉన్నత పదవిలో ఉన్న అధికారులైనా కోర్టు ఉత్తర్వులకు పూర్తిగా లోబడి వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేసింది.
న్యాయస్థాన అధికారాన్నే ప్రశ్నించడం..
ఈ వివాదం కేవలం 40 ఎకరాల భూమి యాజమాన్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, రాజ్యాంగబద్ధ పాలన, న్యాయవ్యవస్థ విశ్వసనీయత, కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన కీలక ప్రశ్నలను ఈ కేసు లేవనెత్తుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించడం సాధారణ పరిపాలనా వైఫల్యం కాదని, అది న్యాయస్థాన అధికారాన్నే ప్రశ్నించినట్లేనని వ్యాఖ్యానించారు.
కోర్టు ఉత్తర్వులను తమకు అనుకూలంగా అర్థం చేసుకోవడం లేదా వాటిని పట్టించుకోకుండా వ్యవహరించడం వంటి ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో న్యాయపాలన పరిరక్షణ దృష్ట్యా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ప్రస్తుత బాధ్యతల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించాలన్నారు.
లోతుకుంట కేసులో పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పులు..
తన తీర్పు ప్రారంభంలో న్యాయమూర్తి గ్రీకు పురాణాల్లోని ‘హైడ్రా’ అనే బహుశిరస్సుల సర్పం ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక తలను తొలగిస్తే మరో తల మొలిచే ఆ సర్పం చివరికి ఓడిపోయిందని గుర్తుచేస్తూ, ప్రభుత్వ వ్యవస్థలు కూడా చట్టానికి అతీతంగా వ్యవహరించలేవని వ్యాఖ్యానించారు. ఈ కేసు సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట గ్రామం సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమి వివాదానికి సంబంధించినది.
భూమి యాజమాన్యంపై ఎన్నో ఏండ్లుగా వివిధ కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ సంస్థ తమకే చట్టబద్ధ హక్కులు ఉన్నాయని వాదించగా, ప్రభుత్వం కూడా యాజమాన్య హక్కును వినియోగించింది. కానీ సివిల్ కోర్టులు, హైకోర్టు సింగిల్ జడ్జి, అనంతరం డివిజన్ బెంచ్ వరుసగా పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. ప్రభుత్వం దాఖలు చేసిన దావా కూడా తిరస్కరణకు గురైంది.
అయినప్పటికీ అధికారులు భూమి వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలతో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమి విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంతో ఇప్పటికే ఒకసారి కోర్టు ధిక్కరణ కేసు నమోదైందని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టబోమని హామీ ఇవ్వడంతో ఆ ధిక్కరణ కేసును కోర్టు ముగించింది. అనంతరం అదే తరహా జోక్యం మళ్లీ కొనసాగడంతో రెండోసారి ధిక్కరణ కేసు దాఖలైంది.
రెండో కేసు విచారణలో హైడ్రా తరఫు న్యాయవాది, కమిషనర్ సూచనల మేరకు ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్ భూమిలోకి ప్రవేశించరని, ఎలాంటి చర్యలు చేపట్టబోరని కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అదే హామీని ఉల్లంఘించడం ఈ ధిక్కరణ కేసులో ప్రధాన అంశంగా మారిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కోర్టుకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించారు..
కోర్టుకు ఇచ్చిన హామీ అనంతరం జులై 17, 18 తేదీల్లో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు, యంత్రాలు, జేసీబీలతో కలిసి పిటిషనర్ భూమిలోకి ప్రవేశించి అక్కడి తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈ చర్యలు జరిగాయని తేల్చింది. సంబంధిత వ్యక్తికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా చర్యలు చేపట్టడం తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది.
తహసీల్దార్ లేదా జిల్లా కలెక్టర్ హైడ్రాను భూమిలోకి వెళ్లాలని ఆదేశించిన ఉత్తర్వులు రికార్డుల్లో లేవని పేర్కొంది. అంతేకాకుండా, రెవెన్యూ అధికారులు కూడా అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అంగీకరించడంతో హైడ్రా వాదన నిలబడలేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు, కోర్టుకు ఇచ్చిన హామీ రెండూ తెలిసిన పరిస్థితిలోనూ మళ్లీ అదే భూమిలోకి ప్రవేశించి చర్యలు చేపట్టడం సాధారణ పరిపాలనా తప్పిదంగా పరిగణించలేమని, అది ఉద్దేశపూర్వక ధిక్కరణేనని తేల్చింది. ప్రభుత్వ అధికారాల వినియోగానికి రాజ్యాంగం, చట్టాలు, కోర్టు ఆదేశాలే పరిమితులు నిర్దేశిస్తాయని గుర్తుచేసింది.
హైడ్రా సమర్పించిన అఫిడవిట్లనూ పరిశీలించినం..
హైడ్రా కమిషనర్ సమర్పించిన రెండు అఫిడవిట్లను కూడా కోర్టు పరిశీలించింది. మొదటి అఫిడవిట్‌లో జరిగిన చర్యలను సమర్థించే ప్రయత్నం కనిపించిందని, కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే రెండో అఫిడవిట్‌లో క్షమాపణ కోరినట్లు గుర్తించింది. శిక్ష తప్పదని స్పష్టమైన తర్వాత వ్యక్తం చేసే క్షమాపణను నిజమైన పశ్చాత్తాపంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.
అవసరమైతే ఉన్నతాధికారుల హోదాను కూడా తగ్గించే అధికారం కోర్టులకు ఉందని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. హైడ్రా కమిషనర్‌పై ఇప్పటికే 62 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన వివరాలను తీర్పులో నమోదు చేసింది. ఈ పరిస్థితి కోర్టు ఉత్తర్వుల అమలుపై అధికారుల వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఉదారంగా వ్యవహరించడం న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
హైడ్రా సమర్పించిన అఫిడవిట్లనూ పరిశీలించినం..
హైడ్రా కమిషనర్ సమర్పించిన రెండు అఫిడవిట్లను కూడా కోర్టు పరిశీలించింది. మొదటి అఫిడవిట్‌లో జరిగిన చర్యలను సమర్థించే ప్రయత్నం కనిపించిందని, కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే రెండో అఫిడవిట్‌లో క్షమాపణ కోరినట్లు గుర్తించింది. శిక్ష తప్పదని స్పష్టమైన తర్వాత వ్యక్తం చేసే క్షమాపణను నిజమైన పశ్చాత్తాపంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.
అవసరమైతే ఉన్నతాధికారుల హోదాను కూడా తగ్గించే అధికారం కోర్టులకు ఉందని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. హైడ్రా కమిషనర్‌పై ఇప్పటికే 62 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన వివరాలను తీర్పులో నమోదు చేసింది. ఈ పరిస్థితి కోర్టు ఉత్తర్వుల అమలుపై అధికారుల వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఉదారంగా వ్యవహరించడం న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
