హైదరాబాద్‌‌లో పెట్రోల్ కోసం బారులు

హైదరాబాద్‌‌లో పెట్రోల్ కోసం బారులు
  • సోషల్ మీడియాల్లో వస్తున్న పుకార్లతో వాహనదారుల ఆందోళన 
  • సరిపడా నిల్వలు ఉన్నాయంటున్న పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడతుందని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో జనం బెంబేలెత్తున్నారు. ధరలు పెరుగనున్నాయని వార్తలు రావడంతో రెండు రోజులుగా హైదరాబాద్‌‌లోని ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. వెహికల్స్​లో ఫుల్ ట్యాంక్‌‌లు నింపుతూ, ప్లాస్టిక్ బాటిళ్లు, క్యాన్లలో కూడా పెట్రోల్ తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో “లీటర్ పెట్రోల్ రూ.500 అవుతుంది.. బంకులు మూతపడతాయి” వంటి తప్పుడు న్యూస్​వైరల్ కావడం వల్ల పెట్రోల్​బంక్​ల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఈనెల 2న రాత్రి నుంచి మెహదీపట్నం, బంజారాహిల్స్, కూకట్‌‌పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో బంకుల వద్ద  వాహనాల క్యూ కనిపించింది.

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు..

క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడుతుందన్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.  భారత్‌‌కు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నది.  అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుతానికి రిటైల్ ధరలు పెరగవని,  రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది.  సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడం వల్ల నగరంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు సంయమనం పాటించాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలి

దేశంలో మూడు నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్​నిల్వలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రజలకు భరోసా ఇవ్వాలి. 2022లో ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కొంత షార్టేజీ ఏర్పడింది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరో 15 రోజుల్లో ధరలు పెరగవు. స్టాక్ మార్కెట్, డాలర్ రేట్లు తగ్గుతున్నాయి.  కేంద్రం ఆయిల్ కంపెనీలతోనైనా ప్రకటన చేయించాలి.
- అమరేందర్ రెడ్డి, పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్