అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత రూపాయి విలువ చరిత్రలోనే మునుపెన్నడూ కనివిని ఎరగని కనిష్ట స్థాయికి పడిపోయింది. మే 18 నాటి ట్రేడింగ్‌లో రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 21 పైసలు క్షీణించి రూ. 96.17 వద్ద ట్రేడ్ అవుతోంది.
గత సెషన్‌లో రూ.95.96 వద్ద ముగిసిన రూపాయి.. శుక్రవారమే తొలిసారిగా రూ. 96 మానసిక స్థాయిని దాటేసింది. యూఏఈలోని అణు కర్మాగారంపై దాడి జరగడం, ఇరాన్-అమెరికా శాంతి చర్చలు నిలిచిపోవడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రాత్రికి రాత్రే 1 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 111 డాలర్లకు చేరుకున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడి భేటీలో ఎలాంటి సానుకూల ఫలితం రాకపోవడం, యూఎస్ డాలర్ బలోపేతం కావడం రూపాయిని మరింత దెబ్బతీశాయి.
ప్రజలు, పరిశ్రమలపై పడే తీవ్ర ప్రభావం :
రూపాయి విలువ ఇంతలా పతనం కావడం వల్ల దేశీయంగా సాధారణ ప్రజలపై, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. మన దేశం ఇంధన అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి.. క్రూడ్ బిల్లులు భారీగా పెరిగి కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు ఖరీదైనవిగా మారుతాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపుతుంది. మరోవైపు విదేశాల నుంచి ముడి సరుకులు, విడిభాగాలను దిగుమతి చేసుకునే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి పరిశ్రమల తయారీ వ్యయం భారీగా పెరుగుతుంది. ఇది కంపెనీల లాభాలను దెబ్బతీసి, పారిశ్రామిక వృద్ధిని మందగించేలా చేస్తుంది.
డాలర్ రూ. 100 దాటే ప్రమాదం?
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచింది. ఈ గ్లోబల్ సంక్షోభం ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం ముగిసి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే డాలర్‌కు ఉన్న డిమాండ్ తగ్గుతుందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ విశ్లేషకులు తెలిపారు. ఒకవేళ RBI దేశంలోకి డాలర్ ప్రవాహాన్ని పెంచేందుకు స్పెషల్ స్కీమ్స్ ప్రకటించకపోతే, రాబోయే రోజుల్లో రూపాయి విలువ డాలర్‌కు రూ.100 మార్కును తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
