తాగి వాహనం నడపడం ప్రమాదకరం. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ మనకు చెప్పే మాటిది. డ్రంకెన్ బాబులను కంట్రోల్ చేసేందుకు డ్రంకెన్ డ్రైవ్ ప్రోగ్రామ్లూ చేస్తుంటారు. వాళ్లు చెప్పడమో, చేయడమో కాదు.. నిజానికి తాగి నడపడం ఎంత ప్రమాదకరమో మనకూ తెలుసు. ఓ రష్యా డ్రైవర్ కూడా అలాగే నిబంధనలు ఉల్లంఘించేశాడు. తాగి నడిపి బ్రిడ్జికి ఢీకొట్టేశాడు. అది ఏ లారీనో, బస్సో కాదు.. ఓ పెద్ద షిప్పు. దక్షిణ కొరియాలో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. బూసాన్ లోని గ్వాంగన్ బ్రిడ్జిని 6 వేల టన్నుల బరువైన సీగ్రాండ్ అనే షిప్పు ఢీకొట్టింది. నిజానికి ఆ బ్రిడ్జి కింది నుంచి అంత పెద్ద ఓడలు వెళ్లలేవు. కానీ, అప్పటికే ఫుల్లుగా తాగేసి ఉన్న ఆ ఓడ కెప్టెన్ సరాసరి ఆ బ్రిడ్జి తొర్రలోకి పోనిచ్చాడు. మళ్లీ రివర్స్ చేసి అక్కడి నుంచి వెళ్లేలోపు కొరియా కోస్ట్గార్డ్లొచ్చి అతడితో సహా షిప్పును అధీనంలోకి తీసుకున్నారు.
అతడి ఆల్కహాల్ స్థాయిలను టెస్ట్ చేయగా ఉండాల్సిన (0.03%) దాని కన్నా మూడు రెట్లు ఎక్కువుందని తేలింది. అంతేకాదు.. బ్రిడ్జిని ఢీకొట్టడానికి ముందు మరో చిన్న క్రూయిజ్ షిప్పును ఆ ఓడ ఢీకొట్టినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఐరన్ పైపులను దించేందుకు ఆ ఓడ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఓడ ఢీకొట్టడంతో బ్రిడ్జి కొద్దిమేర ధ్వంసం అయింది. దక్షిణకొరియాలోనే రెండో పొడవైన బ్రిడ్జి అది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు.

