తూర్పు ఉక్రెయిన్​ లక్ష్యంగా రష్యా దాడులు

తూర్పు ఉక్రెయిన్​ లక్ష్యంగా రష్యా దాడులు

కీవ్​: తూర్పు ఊక్రెయిన్​ను లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలు యుద్ధానికి దూరంగా ఉన్నా.. రష్యా ఆర్మీ మాత్రం మిసైల్స్​తో విరుచుకుపడుతూనే ఉందని లుహాన్స్క్​గవర్నర్​ సెర్హి హైదై ఫేస్​బుక్​లో తెలిపారు. లైసిచాన్స్క్​ నగరాన్ని దక్షిణం నుంచి దిగ్బంధించేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ఈ నగరం సీవీరోడోనెట్స్క్​కు పక్కనే ఉంటుందని, కొన్ని వారాల నుంచి కనికరం లేకుండా దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్​ సైనికులు సీవీరోడోనెట్స్క్ నుంచి తిరుగుముఖం పట్టాయని, వీరిలో కొంత మంది లైసిచాన్స్క్​కు వెళ్తున్నారని వివరించారు. ఒకప్పుడు సీవీరోడోనెట్స్క్ లో  10లక్షల మంది నివాసం ఉండేవారని, ఇప్పుడు 10వేలకు తగ్గారని చెప్పారు. కొందరు ఉక్రెయిన్​ సైనికులు, 500 మంది పౌరులు సీవీరోడోనెట్స్క్ శివారులోని అజోట్​ కెమికల్​ ఫ్యాక్టరీలో తలదాచుకున్నారన్నారు.

ఆ రెండు నగరాలే టార్గెట్​

తూర్పు ఉక్రెయిన్​ వైపు నుంచి లైసిచాన్స్క్​, సీవీరోడోనెట్స్క్ నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు కదులుతున్నాయి. డాన్​బాస్​ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి లైసిచాన్స్క్​, సీవీరోడోనెట్స్క్ నగరాలు సెంటర్​ పాయింట్​గా ఉన్నాయి. తూర్పు ఉక్రెయిన్​లోని 95 శాతం ప్రాంతం రష్యా, వేర్పాటువాద శక్తుల నియంత్రణలో ఉంది. శనివారం లీవ్​ రీజియన్​లోని ఫ్యూయెల్​స్టోరేజీలను రష్యా బలగాలు ధ్వంసం చేశాయి. సెంట్రల్ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జైటోమిర్ ప్రాంతంపై రష్యా రాకెట్లు దాడి చేయగా.. ఉక్రెయిన్ సైనికుడు చనిపోయినట్టు గవర్నర్ విటాలి బుచెంకో తెలిపారు.