హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిం దని రైతు స్వరాజ్య వేదిక విమర్శించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపుల వాటా గణనీయంగా తగ్గిందని వేదిక ప్రతినిధులు కన్నెగంటి రవి, విస్తా కిరణ్ అన్నారు. 2019-=20లో మొత్తం బడ్జెట్‌లో 5.44 శాతం ఉన్న వ్యవసాయ కేటాయింపులు ప్రతి ఏటా తగ్గుతూ 2026-=27లో 3.04 శాతానికి పడిపోయాయని తెలిపారు.
మొత్తం బడ్జెట్ రూ.53.47 లక్షల కోట్లకు పెరిగినప్పటికీ, వ్యవసాయ రంగానికి బడ్జెట్ అంచనా రూ.1.63 లక్షల కోట్లకు తగ్గింది. గతేడాది రూ.1.72 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.9 వేల కోట్లు తగ్గించార్నారు. పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్, కూరగాయలు-, పండ్ల మిషన్ వంటి పథకాలకు గతేడాది రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు కేటాయించినా ఇప్పుడు సున్నాకు తగ్గించారని మండిపడ్డారు.
ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన ఆరు రంగాల జాబితాలో వ్యవసాయం లేకపోవడం దారుణమన్నారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పంట భీమా నిధులు 15.7 శాతం తగ్గి, రూ.12,200 కోట్లకు పరిమితం చే శారని మండిపడ్డారు.
‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’వంటి సూక్ష్మ సేద్య పథకాలకు 13.6 శాతం తగ్గింపు, అటల్ భూజల్ యోజన నిధుల తొలగింపు వంటివి భూగర్భ జలాల క్షీణత, నేల సారం తగ్గుదల వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రకృతి వ్యవసాయానికి రూ.750 కోట్లు కేటాయించినా అది సరిపోదన్నారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల కోసం అరకొర ప్రకటనలు తప్ప..వసాయ రంగం పట్ల నిరాసక్తతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ఎద్దేవా చేశారు.
