శబరిమల కేసు మరో బెంచ్​కు ట్రాన్స్​ఫర్

శబరిమల కేసు మరో బెంచ్​కు ట్రాన్స్​ఫర్

పరిమితుల వల్లే మార్చామన్న సీజేఐ

ఏడు అంశాలతో సుప్రీం గైడ్​లైన్స్

17 నుంచి రోజువారీ విచారణ

న్యూఢిల్లీ: శబరిమల వివాదంపై విచారణను సుప్రీంకోర్టు మరో బెంచ్​కు మార్చింది. ఐదుగురు జడ్జిల బెంచ్​కున్న పరిమితుల దృష్ట్యా ఈ కేసును తొమ్మిది మంది జడ్జిల కానిస్టిట్యూషనల్​ బెంచ్​కు మార్చినట్లు తెలిపింది. దీంతోపాటు కేసు విచారణకు కొత్త మార్గదర్శకాలను సూచించింది. మతవిశ్వాసాలకు సంబంధించి ఏడు అంశాలను పేర్కొంటూ.. ఈ అంశాలకు లోబడే విచారణ జరగాలని సీజేఐ జస్టిస్ ఎస్‌ ఏ బాబ్డేతో కూడిన బెంచ్ సూచించింది. ఈ నెల 17 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని పేర్కొంది. పిటిషన్లను పరిశీలించకుండానే కేసును మరో బెంచ్​కు ట్రాన్స్​ఫర్​ చేయడంపై సీనియర్​ లాయర్లు అభ్యంతరం వ్యక్తంచేయగా  కోర్టు తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆధ్వర్యంలోని ఈ బెంచ్​లో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్​ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్. నాగేశ్వర్​ రావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఆర్. సుభాష్​ రెడ్డి, జస్టిస్ బీఆర్​గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లు ఉన్నారు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకూ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. దీనిని రివ్యూ చేయాలని కోరుతూ భారీగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణకు తొలుత ఐదుగురు జడ్జిలతో సుప్రీం ఓ బెంచ్​ను ఏర్పాటు చేసింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు కావడంతో తాజాగా దీనిని మరో బెంచ్​కు మార్చింది.

ఆ ప్రశ్నలివే..

ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛకు హద్దులున్నాయా?

ఆర్టికల్ 25, 26 ప్రకారం మత స్వేచ్ఛను హక్కుగా భావించవచ్చా?

ఆర్టికల్ 26 పార్ట్ 3 కింద మత స్వేచ్ఛ, హక్కులను పబ్లిక్ ఆర్డర్, నైతికత, ఆరోగ్యపరమైన అంశంగా పరిగణించవచ్చా?

నైతికతకు అర్థం.. రాజ్యాంగ నైతికతతో మతపరమైన స్వేచ్ఛకు వీలుందా?

మతపరమైన అంశాల్లో న్యాయ సమీక్షకు అవకాశం ఉందా?

ఆర్టికల్ 25(2) లోని ‘సెక్షన్ ఆఫ్ హిందూస్’ పదానికి అర్థం?
మతాన్ని నమ్మని వ్యక్తి మతపరమైన అంశాల్లో పిల్​వేసే అవకాశం ఉంటుందా?