కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ వెన్నుపోటు పొడిచారు: రాజస్థాన్ సీఎం గెహ్లాట్

కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ వెన్నుపోటు పొడిచారు: రాజస్థాన్ సీఎం గెహ్లాట్

రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. బీజేపీ సహకారంతో దాదాపు 6 నెలల క్రితం నుంచి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. అమాయకపు మొహంతో ఉన్న ఈ వ్యక్తి ఇలాంటి పనులు చేస్తారని ఎవరూ అనుకోరని చెప్పారు. అయితే తాను ఇక్కడ కూరగాయలు అమ్ముకునేందుకు కూర్చోలేదని, తానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినని గట్టిగా చెప్పారు గెహ్లాట్. కాంగ్రెస్ పార్టీపై వారి కుట్రలు పారలేదని, తమ ప్రభుత్వం పూర్తి బలంతో సేఫ్‌గా ఉందని చెప్పారు గెహ్లాట్. సచిన్ పైలట్ పీసీసీ చీఫ్‌గా ఏడేళ్ల నుంచి ఉన్నారని, ఆయన ఆ పదవికి అర్హుడు కాదని తెలిసినా కొనసాగించామని అన్నారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం‌గా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. గతవారంలో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ సమీపంలోని ఓ హోటల్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. తనను సీఎంగా ప్రకటించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ముందుంచారు. కానీ అందుకు నిరాకరించిన పార్టీ ఆయన రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించింది. అలాగే సీఎం అశోక్ గెహ్లాట్ తన కేబినెట్ నుంచి సచిన్ పైలట్ సహా మరో  ఇద్దరు మంత్రులను తొలగించారు.

అయితే తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని, తాను కాంగ్రెస్ వాదినేనని, కానీ అశోక్ గెహ్లాట్ తన వర్గాన్ని కించపరుస్తున్నారని, కష్టపడి పని చేసిన వారిని గుర్తించడం లేదని చెబుతూ వస్తున్నారు సచిన్ పైలట్. కానీ బీజేపీతో కలిసి పైలట్ తన సర్కారును కూల్చాలని కుట్ర చేశారని గెహ్లాట్ పదేపదే ఆరోపిస్తున్నారు. బీజేపీ సహకారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచిన్ పైలట్ ఇంకా తమ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా బందీలుగా పెట్టుకున్నారని, వారి దగ్గర ఫోన్లు కూడా లాక్కున్నారని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు రిసార్ట్‌లోని ఇతరుల ఫోన్లు తీసుకుని, తమకు కాల్ చేసి తమ ఇబ్బందులను చెప్పుకుంటున్నారని, వాళ్లు తిరిగి రావాలనుకుంటున్నారని చెప్పారు గెహ్లాట్.