సైదాపూర్, వెలుగు : భూమిని సర్వే చేసేందుకు ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న కరీంనగర్ జిల్లా సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన రైతు చెంచు మహేందర్ తన వ్యవసాయ భూమి సర్వే కోసం అప్లై చేసుకున్నాడు. తర్వాత భూమిని సర్వే చేయాలని సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామిని పలుమార్లు కలువగా.. అతడు రూ. 25 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో సదరు రైతు గత నెల 23న ఫోన్ పే ద్వారా రూ. 5 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ నెల 2న సర్వేయర్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన వంగా విహిత్‌రెడ్డికి రూ. 10 వేలు సెండ్ చేయాలని చెప్పగా.. రైతు ఫోన్‌పే చేశాడు. తర్వాత రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో వారి సూచన మేరకు శుక్రవారం సైదాపూర్ శివారులో సర్వేయర్ కుమారస్వామి, అతడి ప్రైవేట్ అసిస్టెంట్ తీగల రాజేశ్‌ను కలిసి రూ.10 వేలు ఇచ్చాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు సర్వేయర్‌ను, అతడి ప్రైవేట్ అసిస్టెంట్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌తో పాటు తీగల రాజేశ్, వంగా విహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ పున్నం చందర్ తెలిపారు.
