
సంజయ్‌లీలా భన్సాలీ సినిమా అంటే కొన్ని అంచనాలుంటాయి. ఇక బయోపిక్ అయితే అవి మరో రేంజ్‌లో ఉంటాయి. పైగా లీడ్ రోల్ ఆలియా భట్ చేస్తుందాయె. అందుకే ‘గంగూబాయ్ కథియావాడీ’ సినిమాపై అనౌన్స్‌మెంట్ సమయంలోనే ఓ అభిప్రాయానికి వచ్చేశారంతా. ఇప్పుడీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. క్షణాల్లో వైరల్ అయిపోయింది. అరవైల కాలంలో గంగూబాయ్ పేరు చెబితే ముంబై మొత్తం ఉలిక్కిపడేది. ప్రేమించినవాడిని పెళ్లాడి అందమైన జీవితాన్ని గడపాలని కలలు కంటూ ముంబైలో అడుగుపెట్టిన ఓ మామూలు అమ్మాయి గంగూబాయ్. కానీ మనువాడాల్సినవాడు ఆమెని ఐదు వందల రూపాయలకు ఎవరికో అమ్మేశాడు. అక్కణ్నుంచి ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. బాలీవుడ్ నటి కావాలని కలలు కన్న ఆమె.. సెక్స్ వర్కర్‌గా బతకాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్రోతల్ హౌస్ నడిపే స్థాయికి చేరింది. పెద్ద పెద్ద వాళ్లందర్నీ గుప్పిట్లో పెట్టుకుని అండర్ వరల్డ్ డాన్‌గా అవతరించింది. అయితే చివరి రోజుల్లో మంచిగా మారిపోయి, ఎంతోమంది అమ్మాయిల్ని వేశ్యావృత్తి నుంచి బైటికి తీసుకొచ్చి కొత్త జీవితాన్నిచ్చిందని చెబుతూ ఉంటారు. ఆమె జీవితాన్నే సినిమాగా తీస్తున్నాడు భన్సాలీ. ఆలియాని పూర్తిగా గంగూ బాయిగా మార్చేశాడని ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఒక పోస్టర్‌లో పరికిణీ జాకెట్టు తొడుక్కుని, రెండు జడలు వేసుకుని, చేతిని బుగ్గకు ఆన్చి చూస్తున్న టీనేజ్అమ్మాయిగా.. మరో పోస్టర్‌లో నుదుటన పెద్ద బొట్టు, ముక్కు పుడకతో నడి వయస్కురాలిగా గంభీరంగాను ఉంది ఆలియా. రెండు లుక్స్ ఆకట్టుకున్నాయి. సినిమా వచ్చే యేడు సెప్టెంబరు 11న విడుదలవుతుంది. అంతకంటే ముందే ఆలియా ‘ఆర్‌ఆర్‌ఆర్’తో అందరి ముందుకీ రానుంది.