సంక్రాంతి తర్వాత రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్

సంక్రాంతి తర్వాత రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్

హైదరాబాద్, వెలుగు:  సంక్రాంతి తర్వాతే రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్​ వస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఈ నెల 13 నుంచి మూఢాలు ఉన్నాయని, సంక్రాంతి తర్వాతే మంచి రోజులు ఉండటంతో అప్పుడే కొత్త చీఫ్​ వస్తారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​తో బీజేపీకి యుద్ధం జరుగుతోందని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని పేర్కొన్నారు. బుధవారం మురళీధర్​రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవికి పోటీ పడుతున్నారా అని ప్రశ్నించగా.. గతంలో ఇస్తానంటే వద్దన్నానని, ఇప్పుడు కావాలనుకుంటే అమిత్​షాకే చెప్తానని సమాధానమిచ్చారు.  పార్టీ నేత రాంమాధవ్​తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

అది కేసీఆర్​ ఓటమే..

రాష్ట్రంలో టీఆర్ఎస్ తో బీజేపీకి యుద్ధం జరుగుతోందని, ఆ పార్టీ తమకు ప్రత్యర్థేనని మురళీధర్​రావు చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్  గెలిచారని అనుకోవడం లేదని.. కార్మికుల్లో, ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో దీని ప్రభావం కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్ కు చెందిన నేతలు కొందరు బీజేపీతో టచ్​లో ఉన్నారన్న అంశాన్ని ప్రస్తావించగా.. టచ్​లో ఉంటే తప్పేమిటన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరలోనే పుంజుకుంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయిందని కామెంట్​ చేశారు. కేవలం మద్యం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న దానిని తాను అంగీకరించనన్నారు. ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ పై తనకు ఎలాంటి అనుమానాలూ లేవని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. కాగా.. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఆ రాష్ట్ర పార్టీకి ఇన్​చార్జిగా ఉన్న మురళీధర్​రావును నేతలు సన్మానించారు.