రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్

రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్
  •     ట్యాక్స్ పేయర్ల డబ్బు ఎవరి జేబులోకి వెళ్లింది?
  •     దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ అభివృద్ధి శూన్యమని ఎద్దేవా

న్యూఢిల్లీ/భువనేశ్వర్: గంగానదిని శుభ్రం చేయడానికి రూ.20 వేల కోట్లు ఖర్చుచేసినా నది ఎందుకు క్లీన్  కాలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్  ట్విటర్ లో నిలదీశారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినపుడు గంగానదిని శుభ్రం చేస్తానని హామీ ఇచ్చారని, అందు కోసం ‘నమామి గంగే’ పేరిట ఆపరేషన్  చేపట్టారని ఆయన గుర్తుచేశారు. కానీ, గత పదేండ్లలో నది శుభ్రం కాకపోగా మరింత  మురికిగా మారిందని విమర్శించారు. ‘‘గంగామాత తనను పిలిచిందని మోదీ 2014లో చెప్పారు.

నాడు అమల్లో ఉన్న ఆపరేషన్ కు పేరు మార్చి ‘నమామి గంగే’ అని పేరుపెట్టారు. గత పదేండ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చుచేశారు. అయినా కూడా నది శుభ్రం కాకపోగా మరింత మురికిగా మారింది. యాంటీబయోటిక్స్ ను సైతం తట్టుకునే బ్యాక్టీరియా నదిలో వృద్ధి చెందిందని పరిశోధనల్లో తేలింది. మరి ట్యాక్స్ పేయర్ల డబ్బు ఎవరి జేబులోకి వెళ్లింది? నదిని క్లీన్  చేస్తామని ఎంత నొక్కారు?” అని రమేశ్  ప్రశ్నించారు. గంగానదికి కూడా అబద్ధం చెప్పిన మనిషిని వారణాసి ప్రజలు ఎలా నమ్మారో అర్థం కావడం లేదన్నారు. అలాగే వారణాసిలో ఎనిమిది గ్రామాలను మోదీ దత్తత తీసుకున్నారని, ఆ గ్రామాల్లో స్మార్ట్  స్కూల్స్, ఇండ్లు నిర్మిస్తానని, వైద్య సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని ఫైర్  అయ్యారు. గత పదేండ్లలో ఆ గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు.

ఓడిపోతున్నానని తెలిసి విద్వేష వ్యాఖ్యలు

ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతున్నానని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని జైరాం రమేశ్  అన్నారు. సోమవారం భువనేశ్వర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మోదీ వేవ్  (లెహర్) ఎక్కడా లేదు. కానీ, ఆయన భాషలో మాత్రం జెహర్  (విషం) ఉంది. ఓడిపోతున్నానని తెలిసి ఆయన ఆందోళన చెందుతున్నారు. రైతులు, యువత, కార్మికులు, మహిళలు, బీసీలు తన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని మోదీ గ్రహించారు. అందుకే హిందూ–ముస్లిం, ముస్లిం లీగ్, టెంపోల్లో కాంగ్రెస్ కు బ్లాక్ మనీ ఇచ్చారని ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలు మార్పు తీసుకురాబోతున్నారు” అని రమేశ్  వ్యాఖ్యానించారు.