స్వాతి మాలివాల్​పై దాడి నిజమే

స్వాతి మాలివాల్​పై దాడి నిజమే

న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తో అర్వింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దాడి చేసింది నిజమే అని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. సోమవారం ఉదయం సీఎం ఇంట్లోనే ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. తోటి సిబ్బందిని ప్రశ్నించడంతో ఈ విషయం స్పష్టమైందన్నారు. బిభవ్ కుమార్​పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘స్వాతి మాలివాల్​తో బిభవ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించడం, దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

మీటింగ్ కోసం స్వాతి మాలివాల్​ను సీఎం కేజ్రీవాల్ ఇంటికి పిలిచారు. ఆమె సోమవారం పొద్దునే వచ్చి డ్రాయింగ్ రూమ్​లో వెయిట్ చేస్తున్నది. అప్పుడే బిభవ్ కుమార్ అక్కడికొచ్చి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో స్వాతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఇక్కడ జరిగిందంతా వాళ్లకు చెప్పింది. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. బిభవ్ కుమార్​పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు’’అని సంజయ్ సింగ్ అన్నారు. స్వాతి మాలివాల్ మంచి నాయకురాలని, ప్రజలతో పాటు దేశం కోసం ఎంతో సేవ చేశారని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకురాల్లో ఆమె కూడా ఒకరని చెప్పారు. ఆమె వెంట పార్టీ మొత్తం ఉందని, కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఈ ఘటనను చాలా సీరియస్​గా తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారికి ఆప్ మద్దతివ్వదని అన్నారు.

ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంట్లోనే మహిళలకు రక్షణ లేదన్నారు. ఇంత జరిగినా కేజ్రీవాల్ ఒక్క స్టేట్​మెంట్ ఇవ్వలేదని తెలిపారు. సీఎం ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. సొంత పార్టీకి చెందిన మహిళా నేతతోనే తన పీఏ అసభ్యకరంగా ప్రవర్తించడంపై కేజ్రీవాల్ స్పందించాలన్నారు. కేసు పెట్టకుండా ఆప్ నేతలే స్వాతిని అడ్డుకున్నారని ఆరోపించారు. కాగా, కేజ్రీవాల్‌‌కు వ్యతిరేకంగా ఢిల్లీ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌లో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్‌‌ సమావేశాలను అడ్డుకున్నారు. ఆప్‌‌ ఎంపీ స్వాతి మాలివాల్​పై సీఎం ఇంట్లో జరిగిన దాడి, మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌కు దళిత మేయర్‌‌ను నియమించాలనే డిమాండ్లతో ఆందోళనకు దిగారు.