12 రోజులు.. రూ.9.29 కోట్ల అమ్మకాలు..విజయవంతంగా ముగిసిన సరస్ మేళా

12 రోజులు.. రూ.9.29 కోట్ల అమ్మకాలు..విజయవంతంగా ముగిసిన సరస్ మేళా
  •     దాదాపు 6 లక్షల మంది విజిట్
  •     చివరి 4 రోజుల్లో రోజూ రూ.కోటికిపైగా బిజినెస్ 
  •     మేళా సక్సెస్ కావడంపై మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని హెచ్‌‌‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌‌‌లో నిర్వహించిన సరస్  మేళా సరికొత్త రికార్డులను సృష్టించింది. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల కొనుగోలుకు సిటీవాసులు ఆసక్తి చూపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ మేళా విజయవంతంగా ముగిసింది. మొత్తం 12 రోజులపాటు సాగిన ఈ ఎగ్జిబిషన్‌‌‌‌లో రూ.9.29 కోట్ల అమ్మకాలు జరిగాయి. 

మొత్తం 5,98,029 మంది మేళాను సందర్శించి ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చివరి నాలుగు రోజుల్లో ప్రతిరోజూ రూ.కోటికిపైగా వ్యాపారం జరగడం విశేషం. కాగా, మూడేండ్ల గణాంకాలతో పోలిస్తే ఈసారి మేళా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళా ఉత్పత్తులకు మార్కెట్‌‌‌‌లో ఆదరణ పెరిగింది. 2024లో రూ.7.81 కోట్లు, 2025లో రూ.3.28 కోట్ల వ్యాపారం జరగ్గా.. ఈ ఏడాది రూ.9.29 కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. సందర్శకుల సంఖ్య కూడా 2025లో 1.69 లక్షలు ఉండగా, ఈసారి దాదాపు 6 లక్షల మార్కును తాకింది.

మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం: మంత్రి సీతక్క

సరస్ మేళా గ్రాండ్ సక్సెస్ కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళలు కేవలం ఉత్పత్తిదారులుగానే కాకుండా, సొంతంగా వ్యాపారాలను నడిపే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.    

చేనేత, పిండి వంటలకు ఫుల్ డిమాండ్
హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌‌‌‌లో 225 స్టాళ్లతో ఈ మేళాను ఏర్పాటు చేశారు. గ్రామీణ మహిళలు సిద్ధం చేసిన సాంప్రదాయ పిండివంటలు, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులు, అలంకరణ సామగ్రికి కొనుగోలుదారుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. మధ్యవర్తులు లేకుండా నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకే లభించడంతో జనం కొనుగోలు చేశారు. ఆశించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం జరగడంతో మహిళా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మేళాకు వచ్చిన ప్రజలకు, మహిళా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామీణాభివృద్ధిశాఖ  ఏర్పాట్లు చేసింది.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా సంఘాల సభ్యులకు వసతి, భోజనం, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించింది.