బతుకుదెరువుకు నాటకాలేస్తున్న సర్పంచ్

బతుకుదెరువుకు నాటకాలేస్తున్న సర్పంచ్

నాగర్​కర్నూల్, వెలుగు: గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో సర్పంచులకు బతుకు భారంగా మారుతోంది. పూట గడిచేందుకు తోచిన పనులు చేయాల్సి వస్తోంది. నాగర్​కర్నూల్​జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామ సర్పంచ్ మాసయ్య సర్కారు చెప్పినట్లుగా గ్రామంలో రైతువేదిక, డంపింగ్​యార్డు, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు బిల్లులు రాక అప్పుల భారం పెరిగిపోయింది. పూట గడవటమే కష్టంగా మారింది. రైతు వేదిక బకాయి రూ.3 లక్షలు, డంపింగ్​యార్డ్​ బకాయి రూ.2.6 లక్షలు, ఇంకుడు గుంతలకు రూ.6.7 లక్షల చొప్పున దాదాపు రూ.16 లక్షల బిల్లులు మూడేండ్లవుతున్నా అందలేదు. పూట గడవడం కష్టంగా మారడంతో మాసయ్య దీపావళి పండగ పూట మూడు రోజులు నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మాసయ్య దీనస్థితి తెలిసి గ్రామస్తులు నాటక ప్రదర్శన తర్వాత తమకు తోచిన సాయం చేశారు.  

బతకడం కష్టంగా మారింది
రైతు వేదిక చివరి బిల్లు రాలేదు.ఇంకుడు గుంతలకు పెట్టిన డబ్బులతో పాటు పల్లె ప్రకృతివనం, డంపింగ్​ యార్డు నిర్మాణం కోసం దాదాపు రూ.16 లక్షల వరకు అప్పు చేసిన. మూడేండ్ల నుంచి పైసా రాలే. మిత్తీలు కట్టలేక చస్తున్న. నా కొడుకు శివను డిగ్రీ బంద్​చేయించి పనిలో పెట్టిన. సర్పంచ్​గా గెలిపించిన ప్రజలే తలా ఇంత వేసి ఆదుకోకపోతారా అన్న ఆశతో నాటకం వేయాలనే ఆలోచనకు వచ్చిన. చిన్నపుడు నేర్చిన నాటకం ఇప్పుడు అమ్మలాగా అన్నం పెడుతున్నది.  

– జల్లపాగ మాసయ్య, మైలారం సర్పంచ్