అమెరికాలో నిరసనలపై సత్య నాదెండ్ల ట్వీట్‌

అమెరికాలో నిరసనలపై సత్య నాదెండ్ల ట్వీట్‌
  • సమాజంలో జాత్యహంకారానికి చోటు లేదు

వాషింగ్టన్‌: ఆఫిక్రన్‌ అమెరికన్‌పై జరిగిన దాడికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల స్పందించారు. “ సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు. ఇతరుల భావాలను అర్థం చేసుకుని గౌరవించడం, పరస్పర అవగాహన కలిగి ఉండటంపై చాలా చేయాల్సి ఉంది. నేను నల్లజాతి వారు, ఆఫ్రికన్‌ కమ్యూనిటీకి సపోర్ట్‌గా ఉంటాను. కంపెనీలోని ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతాం” అని సత్యనాదెండ్ల ట్వీట్‌ చేశారు. కాగా.. ఇదే అంశంపై గూగుల్‌ సీఈవో సుందర్‌‌ పిచాయ్‌ కూడా స్పందిందారు. జాతిపరమైన సమానత్వానికి ఆయన మద్దతు పలికారు. పోలీసుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఫ్లాయిడ్‌ లాంటి వారిని స్మరించుకుంటూ ఆఫ్రికన్‌ – అమెరికన్లకు మద్దతుగా అమెరికాలోని గూగుల్‌, యూట్యూబ్‌ హోం పేజిలను మార్చినట్లు పిచాయ్‌ చెప్పారు. ఆవేదనతో పోరాడుతున్న వారు ఎప్పుడూ ఒంటరి కాదని, జాతి సమానత్వం కోసం ఆందోళన చేస్తున్న వారికి తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఇండియన్‌ అమెరికన్‌, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి కూడా అల్లర్లపై స్పందించారు. న్యాయం కోసం పోరాడుతున్న వారికి మద్దతివ్వాలని ఆమె పిలుపునిచ్చారు.