వారంలోగా ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుంటే ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి.. ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతామని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంఘం నిధులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకు 6 నెలల గడువు ఉంటే.. సర్పంచ్ లకు ఏడాది పాటు గడువు ఉందని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేస్తూ.. కేంద్రం నిధులు ఇస్తలేదని విమర్శలు చేస్తున్నారని సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఊర్లలో మొక్కలు చనిపోతే కలెక్టర్లు, సర్పంచ్లను సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగతనం చేసిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే.. దారి మళ్లించాలని అధికారులను ప్రభుత్వమే ఆదేశించిందన్నారు.
సీఎం కేసీఆర్ కొత్త పీఆర్ యాక్ట్ తీసుకొచ్చి.. స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులను ప్రభుత్వం తీసుకుంటుందని సత్యనారాయణరెడ్డి విమర్శించారు. ఫిర్యాదులు రావడంతో గ్రామ పంచాయతీ పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిందని ఆరోపించారు. మరోవైపు.. పీఆర్ చట్టాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ అన్నారు. అప్పులు చేసి పనులు చేయిస్తున్నామన్నారు. కట్ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని.. మిగతా నిధులు విడుదల చేయాలని సిద్ధార్థ డిమాండ్ చేశారు.

