కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు నరకొద్దు... సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి: సేవ్ కేబీఆర్ సభ్యులు

కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు నరకొద్దు... సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి: సేవ్ కేబీఆర్ సభ్యులు

పంజాగుట్ట, వెలుగు: కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న చెట్లను నరకవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సేవ్ కేబీఆర్ సభ్యులు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఉద్యమకర్త కాజల్ మహేశ్వరి, పర్యావరణవేత్తలు మేజర్ ఖురాణా, నర్సింహారెడ్డి, ప్రొ. సాగర్ ధార, జర్నలిస్ట్ కింగ్‌‌‌‌‌‌‌‌షుక్ నాగ్ మాట్లాడారు. 

అభివృద్ధి పేరిట ప్రభుత్వం ఇక్కడ ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​ల నిర్మాణానికి పూనుకుందని.. దీనివల్ల పార్కు పూర్తిగా ధ్వంసమై కాంక్రీట్ మయంగా మారడమే కాకుండా, భూగర్భ జలాలు ఇంకిపోయి పర్యావరణం కాలుష్యకాసారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

ప్రజాభిప్రాయాలను గౌరవించకుండా, పర్యావరణ ప్రేమికులపై కేసులు పెట్టడం సరికాదని హితవు పలికారు. అనంతరం కేబీఆర్ పార్కు విధ్వంసంపై రూపొందించిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.