కోఠి కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు

కోఠి కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు

బషీర్‌బాగ్‌, వెలుగు: సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గత శనివారం ఉదయం ఏటీఎం వద్ద నగదు డిపాజిట్‌ చేసేందుకు వచ్చిన రిన్షాద్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాటు తుపాకీతో కాల్చి క్యాష్​ బ్యాగ్‌తో పరారయ్యారు. ఘటన అనంతరం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, దాదాపు 800కుపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు కోఠి నుంచి వ్యాపారి వాహనంలో కాచిగూడ డీమార్ట్‌ వరకు వెళ్లి వాహనాన్ని వదిలేసి, బట్టలు మార్చుకుని ఆటోల్లో ప్రయాణిస్తూ పోలీసుల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. కాచిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్లినట్లు సమాచారం. సెల్‌ఫోన్‌ టవర్‌ డంపింగ్‌ ద్వారా ఒక నిందితుడి మొబైల్‌ నెంబర్‌ను సేకరించినట్లు, అతడిని పాత నేరస్తుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఓల్డ్‌సిటీలో పరిచయస్తుల ఇళ్లలో తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన రిన్షాద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉస్మానియా హాస్పిటల్​ డాక్టర్లు వెల్లడించారు.